కరోనా కష్టాలు : ప్రేమించిన వాడి కోసం ఏం చేసిందో తెలుసా

కరోనా కష్టాలు అంతా ఇంతా కాదు. పాపం ఎంతో మంది అష్టకష్టాలు పడుతున్నారు. తమ వారి కోసం..సొంతూరు వెళ్లడానికి సాహసాలు చేస్తున్నారు. తమ లక్ష్యాన్ని చేరుకుంటే..ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఫీలవతున్నారు. బిడ్డ కోసం తల్లి బండిపై 1400 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన మరువకముందే..ఓ యువతి సాహసం చేసింది. బండి మీద కాదు..నడుచుకుంటూ వెళ్లింది. తన ప్రియుడి కోసం ఏకంగా 40 కిలో మీటర్లు నడిచింది. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన సర్వాత్రా చర్చానీయాంశమైంది. (లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం.. పెళ్లిలో ఏడుగురే!)
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్ జంక్షన్ కు చెందిన ఓ యువతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఎప్పటిలాగే..వీరిలో కూడా అదే సీన్ చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు నో చెప్పారు. అంతేకాదు..తమ బిడ్డను పెళ్లి చేసుకుంటే బాగుండదని..బెదిరింపులకు సైతం దిగారు. ఎలాగైనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
ఈ క్రమంలో భారతదేశాన్ని కరోనా రాకాసి కమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం వైరస్ విజృంభించింది. దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. తన ప్రియుడిని కలుసుకుంటానా అని మానసికంగా ఆందోళన చెందింది. దీంతో ఎలాగైనా ప్రియుడిని కలుసుకోవాలని అనుకుంది. కానీ…హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నంకు 40 కిలో మీటర్ల దూరం ఉంది. బస్సులు, ఆటోలు లేకపోవడంతో…కాలి నడకనే ఎంచుకుంది.
ఒంటరిగా బయలుదేరింది. ఎట్టకేలకు ప్రియుడిని కలుసుకుంది. 2020, ఏప్రిల్ 08వ తేదీ బుధవారం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక్కడ పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబ పెద్దలకు కౌన్సెలింగ్ చేశారు. నూతన జంటను ఇంటికి పంపించారు. మొత్తానికి యువతి చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.