బీజెపీని ఎదిరించే ధైర్యం వారికి లేదు.. అయోమయంలో ఏపీ పాలిటిక్స్: సీపీఐ నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

బీజెపీని ఎదిరించే ధైర్యం వారికి లేదు.. అయోమయంలో ఏపీ పాలిటిక్స్: సీపీఐ నారాయణ

CPI Narayana want to joins hands with TDP, Janasena, Congress, CPM in Andhra Pradesh Polls

Updated On : December 23, 2023 / 6:25 PM IST

CPI Narayana: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. బీజెపీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీని వ్యతిరేకిస్తే ఎక్కడ తమకు ఇబ్బందులు సృష్టిస్తారనే భయంతో వీరంతా ఉన్నారని ఆరోపించారు. బీజెపీని ఎదిరించే ధైర్యం వీరికి లేదన్నారు.

వారితోనే పొత్తు
ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వారితోనే పొత్తు పెట్టుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీతో ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ సంబంధం ఉన్న పార్టీలతో తాము పొత్తు పెట్టుకోబోమని.. తమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే అన్ని పార్టీలు కలవాలని సూచించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాజకీయాలు చూసి భయపడున్నారని అన్నారు. ఏపీలో పోల్ మేనేజ్‌మెంట్‌ను బీజేపీ చెడగొడుతుందన్న భయం చంద్రబాబులో ఉందని వ్యాఖ్యానించారు.

హైప్ క్రియేట్ చేస్తున్నారు
పార్లమెంటు భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి, ప్రధాని బాధ్యత వహించాలని నారాయణ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌ను కాపాడలేని అసమర్ధులు దేశాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. లోక్‌స‌భలో ఘటన ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్లు కనబడుతుందని.. ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా లేదని ఆరోపించారు. లోక్‌స‌భ సాధారణ ఎన్నికల ముందట ఇటువంటి ఘటనలు జరిపి దేశంలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు.

Also Read: ఎన్నికల వేళ విజయవాడకు ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో భేటీ

అద్వానీపై కుట్ర
బాబ్రీమసీదు కూల్చివేత కేసులో మొదటి ముద్దాయి ఎల్ కే అద్వానీ అని.. అటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అయోధ్య రామమందిరం ప్రారంభానికి రాకుండా కుట్ర పన్నుతున్నారని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఫిబ్రవరి 2,3,4వ తేదీల్లో జరిగే తమ పార్టీ జాతీయ సమావేశాల్లో లోక్‌స‌భ ఎన్నికలు, ఏపీ శాసనసభ ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు.