Cyclone Fengal: తుపాను ఎఫెక్ట్ .. ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

Cyclone Fengal
AP Rains : ఏపీకి తుఫాను గండం పొంచిఉంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ (బుధవారం) తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఆ తరువాత ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే అయిదు రోజులు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీ రాష్ట్రంపై ప్రభావం పడనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తుపాను ప్రభావంతో బుధవారం నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం (నవంబర్ 28న) కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, గుంటూరు, ఏలూరు, ఉభయగోదారి జిల్లాలు, అనకాపల్లి, మన్యం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణ పట్నం పోర్టుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.