పాక్ డ్రోన్లను తికమకపెట్టి కుప్పకూల్చిన భారత డీ4 వ్యవస్థ.. మచిలీపట్నం, హైదరాబాద్‌లో ఎలా తయారయ్యాయంటే?

సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలంవైపు పంపేటప్పుడు జీపీఎస్‌ ద్వారా ప్రోగ్రామ్‌ చేస్తారు.

పాక్ డ్రోన్లను తికమకపెట్టి కుప్పకూల్చిన భారత డీ4 వ్యవస్థ.. మచిలీపట్నం, హైదరాబాద్‌లో ఎలా తయారయ్యాయంటే?

Updated On : May 13, 2025 / 3:04 PM IST

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన దాడుల్లో డ్రోన్లను భారీగా వాడారు. డ్రోన్ల దాడిని తిప్పికొట్టేందుకు గగనతల రక్షణ వ్యవస్థనూ బాగా ఉపయోగించారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్లను భారత ఎస్‌-400, ఆకాశ్‌ వంటి క్షిపణులు, భారత్‌ ఎలక్ట్రోనిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన డీ4 (డ్రోన్‌ డిటెక్షన్‌, డెటర్‌ అండ్‌ డెస్ట్రాయ్‌) సిస్టమ్స్‌ ప్రధాన పాత్ర పోషించాయి.

డీ4లో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ సిస్టమ్స్‌ ప్రధానమైనవి. డీఆర్‌డీవో వీటిని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత వీటిని దేశం కోసం భారీ సంఖ్యలో తయారు చేసింది మాత్రం బీఈఎల్‌. డీ4 సిస్టమ్స్‌కు రాడార్లను బెంగళూరు యూనిట్‌లో తయారు చేశారు. అలాగే, జామర్లను హైదరాబాద్‌లోని యూనిట్‌ ఉత్పత్తి చేసింది.

Also Read: సీబీఎస్‌ఈ పదో తరగతి రిజల్ట్స్‌ వచ్చేశాయ్‌.. 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణత

ఈ దశ తర్వాత వీటిని ఏపీలోని మచిలీపట్నానికి పంపుతారు. అక్కడి యూనిట్‌ ఎలక్ట్రో ఆప్టిక్‌ ఉపకరణాలను తయారు చేసి, రాడార్లు, జామర్లను అనుసంధాస్తుంది. దీంతో డీ4 సిస్టమ్ పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. శత్రుదేశం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను మన రాడార్లు చాలా దూరం ఉండగానే గుర్తిస్తాయి.

ఆ డ్రోన్లు మరింత ముందుకు వచ్చాక కెమెరాలు, లేజర్‌ రేంజ్‌ ఫైండర్‌ వంటి ఎలక్ట్రో ఆప్టిక్‌ పరికరాలు ఆ డ్రోన్లను మరింత క్లియర్‌గా గుర్తించి మన సైనికులను అప్రమత్తం చేస్తాయి. దీంతో శత్రు డ్రోన్లను జీపీఎస్‌ జామింగ్‌ లేదా లేజర్‌ ఎక్స్‌పరిమెంట్‌ ద్వారా కూల్చుతారు.

సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలంవైపు పంపేటప్పుడు జీపీఎస్‌ ద్వారా ప్రోగ్రామ్‌ చేస్తారు. ఇండియాలో స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్న శాటిలైట్‌ డేటాను డ్రోన్లలో పొందుపరుస్తారు. అనంతరం గూగుల్‌ మ్యాప్‌ సాయంతో ఆ డ్రోన్లు లక్ష్యాల వద్దకు చేరుకుని దాడి చేస్తాయి. డ్రోన్లలోని జీపీఎస్‌ సిగ్నల్‌ను జామ్‌ చేస్తే డ్రోన్లకు ఎటు వైపు వెళ్లాలో తెలియక తికమకపడి కూలిపోతాయి. లేకపోతే భారత్‌ ఆ డ్రోన్లపైకి లేజర్‌ను పంపి ధ్వంసం చేస్తుంది. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చడంలో డీ4 సిస్టమ్స్‌ బాగా పనిచేశాయి.