Botsa vs Kimidi : బొత్స, కిమిడి కోడళ్ల ఫైట్.. జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోల్పోకుండా ఎత్తులు
Botsa vs Kimidi : ఏపీలో స్థానిక ఎన్నికల వేళ విజయనగరం జిల్లా పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.
Kimidi Kala Venkata Rao, Botsa Satyanarayana
Botsa vs Kimidi : ఏపీలో స్థానిక ఎన్నికల వేళ విజయనగరం జిల్లా పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గరివిడి మండల జడ్పీటీసీ స్థానం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. సీనియర్ నేతలు కిమిడి కళా వెంకటరావు, బొత్స సత్యనారాయణ కుటుంబాల నుంచి కోడళ్లు ఎన్నికల బరిలో ఉండటంతో ఈ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది.
Also Read : Work From Home : నవంబర్ 5 నుంచి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..! కారణం ఇదే..
స్థానిక ఎన్నిక అయినప్పటికీ, ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్తుకు ఇది కీలక పరీక్షగా భావిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కళా వెంకటరావు, గత అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి బొత్సకు గతంలో మూడుసార్లు వరుసగా గెలిచిన రికార్డు ఉంది. అయితే కూటమి బలంతో..తన పట్టును మరింత పెంచుకోవాలనేది కళా వెంకట్రావ్ స్కెచ్ అంటున్నారు. గత ఎన్నికల్లో కూటమి గాలిలో కాదు.. సొంత సత్తాతో గెలిచానని ప్రూవ్ చేసుకునేందుకు శ్రమిస్తున్నారట కిమిడి. ఈ నేపథ్యంలో తన కోడలు సంధ్యను గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా నిలపడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారింది.
లోకల్ ఫైట్‌లోనూ తమ కుటుంబ ప్రభావాన్ని చాటుకోవడంతో పాటు, భవిష్యత్‌లో జిల్లా పరిషత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతోనే కిమిడి కళా వెంకట్రావు ఎత్తులు వేస్తున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ కూడా స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కోడలు పూజితను గరివిడి నుంచి బరిలోకి దించడంతో పాటు, గుర్ల మండలంలో తన సోదరి వెంకటలక్ష్మికి అవకాశం కల్పించారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో గెలిచి తన బలమేంటో చూపించాలని ఆయన పరిషత్ పోరును ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
గరివిడి మండలం టీడీపీకి అనుకూలంగా ఉండే ప్రాంతంగా పేరుంది. అయినా బొత్స తన కోడలు పూజితను బరిలోకి దించడం చూస్తే..ప్రతికూల పరిస్థితుల్లో పైచేయి సాధించాలనే ఆరాటంగానే కనిపిస్తోంది. అయితే బొత్సకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, గతంలో చీపురుపల్లిలో ప్రాతినిధ్యం వహించిన అనుభవంతో కోడలు గెలుపు కోసం పావులు కదుపుతున్నారట. దీంతో గరివిడి మండల ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తిని పెంచుతోంది. కిమిడి కోడలు సంధ్య, బొత్స కోడలు పూజిత మధ్య పోటీ కేవలం రెండు కుటుంబాల ఫైట్ కంటే, టీడీపీ, వైసీపీ స్థానిక బలాబలాలను అంచనా వేసే పోరుగా సాగుతోందట. అయితే గత ఎన్నికల్లో బొత్సను ఓడించిన కళావెంకట్రావు చీపురుపల్లిని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కోడలిని జడ్పీటీసీగా బరిలో దింపి జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో బొత్స కూడా గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సమాధానంగా నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీ సీట్లను గెలుచుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకొని విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారట. చీపురుపల్లి సెగ్మెంట్లో నాలుగు జడ్పీటీసీలు ఉండగా, ఇందులో రెండు చోట్ల బొత్స కుటుంబం నుంచి కోడలు పూజిత గరివిడి జడ్పీటీసీ క్యాండిడేట్‌గా, ఆయన చెల్లెలు వెంకటలక్ష్మి గుర్ల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో తన కోడలు పూజిత గెలుపు బొత్సకు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందంటున్నారు. గరివిడి మండలం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నా..బొత్స వ్యక్తిగత ఇమేజ్ వైసీసీకి కలిసొచ్చే అవకాశం ఉందట.
గత ఎన్నికల్లో బొత్సపై విజయం సాధించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు..తన పనితీరుతో పాటు ప్రాబల్యానికి పరీక్షగా భావిస్తున్నారట. సేమ్‌టైమ్ తన గెలుపు కూటమి వేవ్‌లో వచ్చింది కాదని నిరూపించాలని భావిస్తున్నారట. తన సొంత నియోజకవర్గమైన రాజాం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉండటంతో కిమిడి కుటుంబ రాజకీయ భవిష్యత్‌కు ఈ ఎన్నికలు కీలకమన్న ఆలోచనలో కళా ఉన్నారని అంటున్నారు. ఇక బొత్స కూడా తన ఇలాకాలో పరువు సమస్యగా భావిస్తూ స్థానిక ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టారని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో అనూహ్య ఓటమితో డీలా పడిన బొత్స..ఈ ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని, చీపురుపల్లి తన కంచుకోట అని నిరూపించుకోవాలని తాపత్రయ పడుతున్నారట. దీంతో ఇద్దరు సీనియర్ నేతలు ఎత్తుకుపై ఎత్తులు నేపథ్యంలో గరివిడి జడ్పీటీసీ సీటులో ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
