Daytime Curfew in AP : ఏపీలో ఎల్లుండి నుంచి పగటి పూట కర్ఫ్యూ

Day
Daytime Curfew in AP : కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో మే 5వ తేదీనుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసేదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఉదయం 6నుంచి 12 గంటలవరకు యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని… మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బందిలేకుండా.. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంజగన్ అధికారులతో సమీక్షించారని ఆళ్లనాని చెప్పారు.
కర్ఫ్యూ అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలు త్వరలో తెలియచేస్తానని మంత్రి తెలిపారు. ఏపీలో రోజుకు దాదాపు 24 వేల కేసులు నమోదవుతున్నాయి. పరిస్ధితి అదుపు చేయి దాటిపోతోందని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించింది. మధ్యాహ్నం 12 తర్వాత అత్యవసర సేవలను అనుమతిస్తారు. ఈ ఆంక్షలను మొదట రెండు వారాలపాటు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది
ఉదయం 6గంటల నుంచి 12 గంటల సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. ఎల్లుండి నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. సోమవారం సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంగళవార జరిగే క్యాబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి జగన్ కర్ఫ్యూ పై సుదీర్ఘ చర్చ జరపనున్నట్లు తెలిసింది.