Dharmana Prasada Rao: ధర్మాన సడెన్ రీ ఎంట్రీతో వైసీపీ కేడర్ షాక్.. ఆయన అసలు స్ట్రాటజీ ఇదేనా?
ఆ సమయంలో.. వంద కార్లతో వెళ్లి మరీ జగన్‌కు స్వాగతం పలికారు ధర్మాన. ఆయన తీరుపై ఇప్పుడు రకరకాలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

రానన్నారు.. రాలేనన్నారు.. వచ్చే పరిస్థితి లేదన్నారు.. కట్ చేస్తే సడెన్ ఎంట్రీతో రయ్‌న దూసుకొచ్చారు. మాజీ మంత్రి ధర్మాన తీరు.. ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన ధర్మాన.. 9నెలలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇక ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్న టైమ్‌లో.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు యాక్టివ్ అయ్యారు.. ధర్మాన స్ట్రాటజీ అదేనా..
ధర్మాన ప్రసాదరావు.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ధర్మాన అంటేనే కూల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రత్యర్థులు మాటల తూటాలు సంధించినా.. విమర్శలు ఎక్కు పెట్టినా.. తన మార్క్ వాక్ చాతుర్యంతో సుతిమెత్తగా తిప్పికొడుతుంటారు. పాలిటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన ఆయన.. ఆ తర్వాత పరిణామాలతో వైసీపీలో చేరారు.
వైసీపీలోనూ కీలకంగా వ్యవహరించారు. జగన్ హయాంలో కీలకమైన రెవెన్యూ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐతే గత ఎన్నికల్లో ధర్మానకు ఘోర పరాభవం ఎదురైంది. ఎలక్షన్స్‌లో ఓటమి తర్వాత.. ఆయన కనిపించకుండా పోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ధర్మాన చుట్టూ రకరకాల ప్రచారం వినిపించింది. కట్ చేస్తే ఇప్పుడు సడెన్‌గా ప్రత్యక్షం అయ్యారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.
అందుబాటులో లేకుండా..
పార్టీ కేడర్‌కే కాదు.. పార్టీ అధినేతకు కూడా ధర్మాన ఇన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌ను ఒక్కసారి కూడా కలిసింది లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో జగన్ నిర్వహించిన మీటింగ్ కూడా ధర్మాన డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
ఐతే పార్టీ మారడం కాదు.. రాజకీయాలకు ధర్మాన గుడ్‌బై చెప్పేశారంటూ గాసిప్ వినిపించింది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. కీలకనేతలంతా వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు కూడా ! ఐతే తాను మరో రెండేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు.. పార్టీ వర్గాలకు చెప్పుకుంటూ వచ్చారు ధర్మాన. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గ బాధ్యతను మరొకరికి అప్పగించాలని వైసీపీ ప్రయత్నించింది. నిజానికి నూతన ఇంచార్జిని నియమించాలన్న ప్రతిపాదన తీసుకువచ్చిందే ధర్మాన అనే ప్రచారం జరిగింది.
ఆరోగ్య కారణాలతో రెండేళ్ల పాటు.. యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించనని చెప్పిన ధర్మాన.. సడెన్‌గా పొలిటికల్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యారు. ఇది సిక్కోలు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం చనిపోగా.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసిపి అధినేత జగన్ పాలకొండ వెళ్లారు.
వంద కార్లతో వెళ్లి మరీ జగన్‌కు స్వాగతం
ఆ సమయంలో.. వంద కార్లతో వెళ్లి మరీ జగన్‌కు స్వాగతం పలికారు ధర్మాన. ఆయన తీరుపై ఇప్పుడు రకరకాలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇన్నాళ్లు జగన్ నిర్వహించిన కీలక సమావేశాలకు కూడా దూరంగా ఉన్న ధర్మాన.. ఇలా సడెన్ ఎంట్రీ ఇవ్వడంపై పార్టీ నేతలకే కాదు, అధిష్టానానికి కూడా షాకింగ్ ఫ్యాక్టర్‌గా మారిందట. ఐతే ధర్మాన రాజకీయం తెలిసిన వాళ్లు మాత్రం.. దీనివెనక పక్కా స్ట్రాటజీ ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు.
పార్టీలో సైలెంట్‌గా ఉంటే.. నియోజకవర్గ బాధ్యతలను వేరొకరికి అప్పగించే అవకాశం ఉంటుందని.. అదే జరిగితే నియోజకవర్గంపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుందని.. దీంతో తానే యాక్టివ్ అయ్యారన్నది మరికొందరి వాదన. వయసురీత్యా తను పోటీలో ఉన్నా లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఉంటుందని.. ఆ ఆలోచనతోనే అజ్ఞాతం వీడారంటూ ప్రచారం జరుగుతోంది.
రానని చెప్పి వచ్చారంటే.. వస్తూ వస్తూ హడావుడి క్రియేట్ చేశారంటే.. ధర్మాన సడెన్ ఎంట్రీ వెనక భారీ వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తు్ననాయ్. ఆయన స్ట్రాటజీ ఎలా ఉన్నా.. ధర్మాన ఎంట్రీ మాత్రం సిక్కోలు వైసీపీ కేడర్‌కు కొత్త ఊపిరి పోసిందనే ప్రచారం జరుగుతోంది.