డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు? సీఎం చంద్రబాబు Vs మాజీ సీఎం జగన్..
వైసీపీ చీఫ్ జగన్ చేసిన కామెంట్స్ కు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

Chandrababu Vs Ys Jagan (Photo Credit : Google)
Chandrababu Vs Ys Jagan : ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ పై మాటల తూటలు పేలుతున్నాయి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ ఇంట్లో సమస్యలను పెద్దది చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. తన చెల్లి, తల్లి ఫోటోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో కుటుంబ కలహాలు లేవా? అని ప్రశ్నించారు జగన్.
వైసీపీ చీఫ్ జగన్ చేసిన కామెంట్స్ కు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. జగనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎదురుదాడికి దిగారాయన. ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి, చెల్లిని రోడ్డుకు లాగడం దారుణం అన్నారు. పైగా మమ్మల్ని నిందిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆస్తిలో వాటా కావాలంటే తనను విమర్శించొద్దని చెల్లికి కండీషన్ పెట్టే వాళ్లను ఏమనాలి? అని చంద్రబాబు నిలదీశారు. తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రాదా అని ప్రశ్నించారు చంద్రబాబు.
”తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వడానికి కండీషన్లు పెట్టడం ఏంటి? తన గురించి, అవినాశ్, భారతి గురించి మాట్లాడకపోతేనే ఆస్తి ఇస్తానని జగన్ అనడం దారుణం. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని నేనెప్పుడూ ఊహించలేదు. జగన్ వి చిల్లర రాజకీయాలు. ఇలాంటి వ్యక్తితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉంది. జగన్ ను గుర్తించడం కూడా దండగే” అని విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు.
అటు సోషల్ మీడియాలోనూ టీడీపీ, వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. చెల్లి రాజకీయాల్లో ఉంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని టీడీపీ విమర్శలు చేసింది. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తానని షర్మిలను జగన్ బెదిరిస్తున్నారని ఆరోపించింది. ”రాజకీయంగా నాకు అడ్డు రాకు. అప్పుడే ఆస్తులు రాసిస్తా. నన్ను ఇబ్బందులు పెడుతుంటే నీకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? సరస్వతి సిమెంట్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి. అమ్మ, నీపై కేసు వేస్తున్నా” అని షర్మిలకు జగన్ లేఖ రాశారని ట్వీట్ చేసింది టీడీపీ.
Also Read : ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న నేతలు.. లీడర్లకు ఫ్యాన్ కింద ఉక్కపోత ఎక్కువైందా?