ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం

local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. గతంలో కంటే కరోనా కేసులు తగ్గాయంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు భద్రత పెంచాలని హైకోర్టును కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు అదనపు అఫిడవిట్ ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది.
గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినందున ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ లో తెలిపింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై గతంలోనే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు నిధులు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని ఏపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలకు సహకరించాలని కోరింది. ఎన్నికల సంఘం సమగ్ర సమాచారం ఇవ్వాలంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం, వద్దని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఏపీకి ముడిపెట్టొద్దని మంత్రులు కోరుతున్నారు. అవి అసెంబ్లీ ఎన్నికలని, రాజ్యాంగం ప్రకారం వాటిని నిర్వహించాల్సిందేనని చెబుతున్నారు.