ఏపీ గవర్నర్‌తో జగన్ భేటీ.. దాడులపై ఫిర్యాదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో దాడులు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.

ఏపీ గవర్నర్‌తో జగన్ భేటీ.. దాడులపై ఫిర్యాదు

Updated On : July 21, 2024 / 7:45 PM IST

Ys Jagan Mohan Reddy : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన జగన్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వినుకొండలో వైసీపీ కార్యకర్త అత్యంత దారుణ హత్యకు గురయ్యారని.. ఈ రాజకీయ హత్యలు, దాడుల వెనుక ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం ప్రోత్సాహంతోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. వీటన్నింటిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. అలాగే ఫోటోలు, వీడియోలు కూడా గవర్నర్ కు చూపించారు.

అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై నిరసన తెలియజేస్తామని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించారు. దాడుల అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లేలా 24న ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ నిర్ణయించారు. అవసరమైతే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతిని కూడా కలుస్తామని జగన్ చెప్పిన విషయం విదితమే. ఇప్పటికే దాడులకు సంబంధించి వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాజాగా వినుకొండ ఘటన నేపథ్యంలో దాడుల అంశాన్ని వైసీపీ మరింత సీరియస్ గా తీసుకుంది. ఇటు అసెంబ్లీతో పాటు అటు పార్లమెంటులో దాడుల అంశాన్ని లేవనెత్తి దేశవ్యాప్తంగా చర్చించుకునే వైసీపీ ఆలోచన చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో దాడులు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.

Also Read : మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ- గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు