కరోనా వార్డులో డాక్టర్ పేరుతో కిలాడిలేడీ..నాలుగు రోజులుగా ఐసీయూలో తిరుగుతున్న మహిళ

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 06:50 PM IST
కరోనా వార్డులో డాక్టర్ పేరుతో కిలాడిలేడీ..నాలుగు రోజులుగా ఐసీయూలో తిరుగుతున్న మహిళ

Updated On : July 30, 2020 / 7:24 PM IST

కరోనా రోగులకు చికిత్స చేయడానికి డాక్టర్లు సాహసించడం లేదు. వైద్యులు సైతం పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్ మెంట్ కిట్ ధరించి వెళ్లి మరీ వైద్యం చేస్తుంటారు. అలాంటింది కృష్ణా జిల్లాలో ఓ 45 ఏళ్ల మహిళ డాక్టర్ అవతారమెత్తి నాలుగు రోజులుగా ఐసీయూలో ఉన్న రోగుల వద్దకు వెళ్లొస్తోంది. అదే రీతిలో మెడలో స్టెతస్కోప్ వేసుకుని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లొచ్చింది. అక్కడ స్టోర్ కు వెళ్లి డాక్టర్ శైలజా అని రిజిస్టర్ లో రాసి పీపీఈ కిట్ తీసుకుంది.

సిబ్బందికి అనుమానం వచ్చి మీరు ఎవరని ప్రశ్నించగా అయామ్ డాక్టర్ శైలజ అని చెప్పింది. ఏ విభాగంలో పని చేస్తారని అడగ్గా ఇక్కడే కోవిడ్ ఆస్పత్రిలో అని చెప్పింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది పీపీఈ తీసుకుంటే సంతకం పెట్టాలని చెప్పి పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ కూర్చొబెట్టి ఐడెంటిటీ కార్డు అడగ్గా తన వద్ద లేదని చెప్పింది.

తన బంధువులు వస్తానంటే వచ్చానని ఒక సారి. ఆయుర్వేద వైద్యురాలునని, ఇంకొకసారి బంధువులు ఐసీయూలో ఉంటే చూసేందుకు వచ్చానని మరోసారి.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెపై మాచవరం సీఐకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్టర్, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళపై గతంలో అనేక కేసులున్నాయని పోలీసులు తెలిపారు. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ డబ్బులు కూడా వసూలు చేసినట్లు డీసీపీ హర్ష వర్ధన్ చెప్పారు.

డాక్టర్ శైలజా పేరుతో సదరు మహిళ నాలుగు రోజులుగా ఐసీయూలో తిరుగుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల కొత్తగా 80 మంది వైద్యులు రావడంతో వారిలో ఒకరై ఉంటారని సిబ్బంది భావించారు. అంతేకాకుండా పీపీఈ వేసుకోవడంతో గుర్తుపట్టలేకపోయినట్లు చెబుతున్నారు.