తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా మోసం : రైతు దగ్గర నుంచి రూ.5లక్షలు కాజేసిన నకిలీ డీఎస్పీ

తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా మోసం : రైతు దగ్గర నుంచి రూ.5లక్షలు కాజేసిన నకిలీ డీఎస్పీ

Updated On : February 17, 2021 / 6:48 PM IST

Fake DSP stole Rs 5 lakh from a farmer : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఘరానా మోసం జరిగింది. పోలీసుల హెల్ప్‌ తీసుకుని మరీ వల్లూరి కుమార్ అనే రైతును బురడీకొట్టించిన సంఘటన సంచలనంగా మారింది. గత నెల 29న సామర్లకోటలో పందాన్ని గెలుస్తాయన్న కోపంతో ఓ రైతుకు చెందిన నాలుగు ఎడ్లకు విషమిచ్చి చంపారు దుండగులు. అసలే ఎడ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితుడు ఓ నకిలీ పోలీస్‌ వల్ల 5 లక్షల రూపాయలు కోల్పోయాడు.

ఇటీవల సామర్ల కోట ఎస్సై సుమంత్‌కు ఓ నంబర్‌ నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను క్రైమ్‌ డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. సామర్లకోట ఎడ్ల కేసు విచారణ ఎందాక వచ్చిందని ఆరా తీశాడు నకిలీ డీఎస్పీ. అతను నిజంగా క్రైమ్ డీఎస్పీ అనుకున్న ఎస్సై సుమంత్‌ .. ఆయనకు అన్ని వివరాలు చెప్పారు. అంతావిన్న నకిలీ డీఎస్పీ రైతుల విషయంలో కాస్త సానుభూతితో వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తిచేయాలంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు. ఈ కేసుపై తాను కూడా దృష్టిసారిస్తానని.. తనకు ఎడ్ల యజమానితో ఫోన్ చేయించాలని ఎస్సైకి చెప్పాడు నకిలీ డీఎస్పీ. దీంతో సుమంత్‌ ఎడ్ల యజమాని వల్లూరి కుమార్ కు నకిలీ డీఎస్పీ నంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పాడు.

మాటలు వినబడ్డాయి. ఒక డీఎస్పీయే తనకు జరిగిన నష్టం గురించి ఆలోచించి న్యాయం చేయడానికి ముందుకు వచ్చాడని పొంగిపోయాడు. వల్లూరి కుమార్ పూర్తిగా తనబుట్టలో పడ్డాడని గ్రహించిన నకిలీ డీఎస్పీ చనిపోయిన నాలుగు ఎడ్లకు 46 లక్షల రూపాయల నష్టపరిహారం వస్తుందని నమ్మబలికాడు. అయితే నష్టపరిహారం రావాలంటే ముందుగా తన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని.. అదీ ఎవరికీ చెప్పొద్దన్నాడు.

ఇలా ఫలు దఫాలుగా 5లక్షల రూపాయలను నకిలీ డీఎస్పీ ఖాతాలో జమచేశాడు రైతు. రోజులు గడిచినా డబ్బు రాకపోవడంతో నకిలీ డీఎస్పీ నెంబర్ ఇచ్చిన ఎస్సై దగ్గరికి వెళ్లాడు వల్లూరి కుమార్. తాను 5 లక్షల రూపాయలు డీఎస్పీకి ఇచ్చానని చెప్పడంతో పోలీసులంతా షాక్‌ తిన్నారు. ఓ రైతును మోసం చేయడానికి ఎస్సైనే చీట్ చేశాడని తెలిసి పోలీసులంతా తలపట్టుకున్నారు.

అమాయక రైతును చీట్‌ చేయడానికి కేటుగాడు ఎస్సైని వాడుకున్నాడని తెలిస్తే పరువుపోతుందని తొలత భావించిన డిపార్ట్‌ మెంట్‌ పెద్దలు.. ఇలాంటి విషయంలో చీటర్‌ను వదిలిపెట్టొద్దని జరిగిన విషయాన్ని బయటకు చెప్పారు. నకిలీ డీఎస్పీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు ఎవరినీ డబ్బులు అడగరని.. ఎవరైనా పోలీసులమని చెప్పి డబ్బులు అడిగితే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు.