బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి

చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి
గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు.. రాళ్లతో కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే కారు మరో కారుని ఢీకొట్టింది. చివరికి.. ధ్వంసమైన కారులోనే ఎమ్మెల్యే పిన్నెల్లి వెనుదిరిగారు.
జాతీయ రహదారిపై రణరంగం:
రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. సోమవారం(జనవరి 6,2020) భారీగా పాదయాత్రతో హోరెత్తించిన రైతులు, మహిళలు.. మంగళవారం(జనవరి 7,2020) చినకాకాని దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించారు. చినకాకాని జాతీయ రహదారిపై వేల మంది నిరసనకారులు బైఠాయించి ధర్నా చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో హైవే పై రాకపోకలు స్తంభించాయి. కాజా సెంటర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
అతి కష్టం మీద బయటపడిన మంత్రి:
అమరావతి జేఏసీ పిలుపుమేరకు.. జాతీయ రహదారిపై బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చినకాకాని దగ్గర ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్:
చినకాకాని చేరుకుని హైవేపై బైఠాయించిన టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆందోళనలో పాల్గొనే రైతుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగి ఆ ప్రాంతం రణరంగంలా మారింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు చినకాకాని చేరుకోకుండా ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ.. రైతులు మాత్రం నిరసనలో భారీగా పాల్గన్నారు.