కోడి కోసం కోట్లాట.. కోపంతో కొడుకును చంపిన తండ్రి

  • Published By: sreehari ,Published On : February 24, 2020 / 01:21 AM IST
కోడి కోసం కోట్లాట.. కోపంతో కొడుకును చంపిన తండ్రి

Updated On : February 24, 2020 / 1:21 AM IST

సాధారణంగా తండ్రికొడుకుల మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవలు వస్తుంటాయి. ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఘర్షణ పడుతుంటారు. కానీ, ఇక్కడ తండ్రీకొడుకుల మధ్య గొడవకు ఇవే ఏమి కారణం కావు.. కేవలం కోడి కోసం కొట్టుకున్నారు. మాటామాటా పెరిగింది. కోడి కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. కొడుకుపై కోపంతో ఆవేశంలో తండ్రి విచక్షణ కోల్పోయాడు. కన్నకొడకుని అతిదారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొద్దిడిలో జరిగింది. కొన్నాళ్లుగా అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే వ్యక్తి తన ఇంట్లో ఓ కోడిని పెంచుతున్నాడు. తండ్రి కాంతారావు ఆ కోడిని గ్రామంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నీటిలో ముంచాడు. దాంతో ఆ కోడి ఊపిరాడక చనిపోయింది. 

కాసేపటికి కాంతారావు కొడుకు మద్దేశ్వరరావు ఇంటికి వచ్చాడు. పెంచుకుంటున్న కోడి కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులను అడిగాడు. దానికి తండ్రి కోడి చనిపోయిందని చెప్పాడు. జరిగిన విషయం చెప్పాడా తండ్రి. అంతే.. కుమారుడికి కోపం వచ్చింది. ఎందుకు అలా చేశావు అంటూ తండ్రిపై అరిచాడు. తండ్రి కాంతారావుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ కొడుకుపై తిరగబడ్డాడు.

పక్కనే ఉన్న కత్తిని తీసి కొడుకు ఛాతిపై గట్టిగా పొడిచాడు. దాంతో విలవిలలాడిన మద్దేశ్వరరావు అక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు వదిలేశాడు. కుమారుడు చనిపోవడంతో తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న కాంతారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read More>>గొంతుకోసి ఉరేయడమే కాదు.. కళ్లు పీకేశాడు