Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యం

Devineni Uma Absconded
Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించినందుకు మాజీ మంత్రి పై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. దేవినేని ఉమా లేకపోవడంతో సీఐడీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవినేని ఉమ.. సీఎం జగన్ మాట్లాడినట్లు ఓ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించారు. దీనిపై.. కర్నూలుకు చెందిన వైసీపీ నేత అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఐడీకి కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ నేత ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.
ఐపీసీ సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు దేవినేని. ఆ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది.