EX Minister Ganta Srinivasa Rao : న్యాయ పోరాటం చేస్తా.. సీఎం జగన్ కుట్రలను విఫలం చేస్తాం
ఏ లక్ష్యంకోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...

EX Minister Ganta Srinivasa Rao
TDP Leader Ganta Srinivasa Rao : ఏ లక్ష్యంకోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 21న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ లేఖ రాశారు. అప్పటి నుంచి ఆ రాజీనామా పెండింగ్ లోనే ఉంది. తాజాగా మంగళవారం స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా రాజీనామాను ఆమోదించారు. స్పీకర్ నిర్ణయంపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read : CM Revanth Security Changed: రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్ విభాగం.. ఎందుకంటే?
పవిత్రమైన ఆశయంకోసం మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి నేను రాజీనా చేశానని, స్వయంగా స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించడం జరిగిందని అన్నారు. రాజీనామా తరువాత స్పీకర్ ను ఎన్నిసార్లు కలిసిన నా రాజీనామా ఆమోదించలేదని, నా రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారని గంటా అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో పోరాటం చేశామని, మేము చేసిన పోరాటానికి అప్పటి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, వైసీపీ నాయకులు మద్దతు తెలిపి పోరాటం చేసి ఉంటే కేంద్రం స్టీల్ ప్లాంట్ పై ఆలోచన చేసేదేమోనని గంటా అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం వైపు సీఎం జగన్ కన్నెత్తి చూడలేదని గంటా విమర్శించారు. సీఎం జగన్ విశాఖ అనేక సార్లు పర్యటనకు వచ్చినా దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదని అన్నారు. తన కేసులు కోసం కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారంటూ గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి నా రాజీనామా ఆమోదించకుండా.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నా రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని స్పీకర్ నిర్ణయాన్ని గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండేందుకు కుట్రకోణంతో స్పీకర్ నా రాజీనామాను ఆమోదించారని, రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తానని, జగన్ అనుకున్న లక్ష్యాన్ని నెరవేరనివ్వమని గంటా తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయి. నన్ను అడగకుండా రాజీనామాను ఆమోదించారని, కుట్ర కోణంతో వైసీపీ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని గంటా శ్రీనివాస్ రావు అన్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ ప్రశ్నించాడు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు అన్నాడు. రాజీనామా ఆమోదించడంపై న్యాయ పోరాటం చేస్తా.. రాజీనామాను ఆమోదించి జగన్ రాజకీయంగా పాతాళానికి పడిపోయాడని గంటా అన్నాడు. ఉద్యోగులు, నిర్వాసితులు తో మాట్లాడి స్టీల్ ప్లాంట్ పోరాటం భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పాడు.