Ganta Srinivasurao : రుషికొండ విజిట్ చేసి ఎవరికోసం భవనాలు కడతున్నారో జగన్ ప్రజలకు చెప్పాలి
రేపు సీఎం జగన్ అదే రూట్ లో వెళ్తారు. రుషికొండ విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరికోసం భవనాలు కడుతున్నారో? ఆ గండికోట రహస్యం సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.

Ganta Srinivasurao
Former Minister Ganta Srinivasurao : ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చెయ్యడానికి ప్రారంభోత్సవాలతో హడావుడి చేసేందుకు రేపు విశాఖ పట్టణంకు సీఎం జగన్ వస్తున్నారు.. గతంలో ఉన్న వాటినే మరల ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవాలు అంటే ప్రైవేట్ కంపెనీలు చూసుకుంటాయి. కానీ, అందుకు భిన్నంగా ప్రభుత్వమే అన్ని చూసుకుంటుందని గంటా ఎద్దేవా చేశారు. రేపు విశాఖ వస్తున్న జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఎక్కడ అనుమతిస్తే అక్కడ కలుస్తాం.. దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
రుషికొండలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియజెయ్యడం లేదు. రుషికొండపై రకరకాల ప్రకటనలు చేశారు. చివరికి మొన్న తెరతీసి దొంగ జీవో విడుదల చేశారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు సీఎం అదే రూట్ లో వెళ్తారు. రుషికొండ విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరికోసం భవనాలు కడుతున్నారో? ఆ గండికోట రహస్యం సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని గంటా డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమంది కంపెనీలు పెట్టారు.. ఎంత మంది వెళ్లారో తెలుసుకోవాలని గంటా ప్రభుత్వానికి సూచించారు. లులూ వంటి పెద్ద సంస్థను ఇక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో లులూ అతిపెద్ద మాల్ గా ఉందని గంటా అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుకబాటు తనం గురించి మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారు.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. మీ కక్ష్యపూరిత చర్యల వల్ల జైలుకు వెళ్లారని గంటా అన్నారు. చంద్రబాబు హెల్త్ గురించి వైద్యులు చెప్పాలి.. జైలు అధికారులు కాదు. కొందరు మంత్రులు ఆయన తినే ఆహరం మీదకూడా కామెంట్లు చేస్తున్నారు. మంత్రులు ఎవ్వరూ వారి శాఖల గురించి, వారి శాఖలో సమస్య గురించి మాట్లడం లేదని గంటా విమర్శించారు. ఎంసెట్ మూడవ కౌన్సిలింగ్ గురించి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారి రక్తంతో లేఖలు రాస్తున్నారు. మంత్రి బొత్సకు ఇవి కనబడం లేదా..? ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ అంటున్నారు. మెగా డిఎస్సీ అంటున్నారు. ఇవన్నీ చేసే లోపు ఎన్నికలు వచ్చాయంటూ తప్పించుకుంటారని గంటా అన్నారు.