AP Government: ఏపీలో క్రీడాకారులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్‌.. వారికి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు

క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీ పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Government: ఏపీలో క్రీడాకారులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్‌.. వారికి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు

CM Chandrababu Naidu

Updated On : April 20, 2025 / 9:38 AM IST

AP Govt: ఏపీలోని క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రీడా పాలసీ 2024-29లో భాగంగా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల్లో 3శాతం హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీ పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖల్లో క్రీడా కారులకు 3శాతం స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో రాత పరీక్ష లేకుండానే రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో నియామకం జరిగేలా మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం మెగా డీఎస్సీలోనూ క్రీడాకారులకు అదనంగా ఒకశాతం ఉద్యోగాలు లభించనున్నాయి.

 

కొత్త క్రీడా విధానం ప్రకటించక ముందు 29 క్రీడల్లో పతకాలు సాధించిన వారికే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించేవి. దాన్ని ఇప్పుడు రెండు కేటగిరీలో 65రకాల క్రీడలను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన వారికి గ్రూప్ -1 ఉద్యోగాలు, కాంస్య పతకం వచ్చిన వారికి గ్రూప్-2 పోస్టులు ఇస్తారు. ఏషియన్ పారా గేమ్స్ లో స్వర్ణ, రజత పతకాలు సాధించినవారికి గ్రూపు-2 ఉద్యోగాలు, రజతపతకం సాధించిన వారితో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి గ్రూపు-3 ఉద్యోగాలు లభించనున్నాయి. నాలుగేళ్లలోపు జరిగే వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే వారికి గ్రూప్-3 ఉద్యోగాలు, నాలుగేళ్లకోసారి జరిగే ఏషియన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించినవారికి గ్రూప్-3 ఉద్యోగాలు లభించనున్నాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతీయ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా గ్రూపు-3 ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

 

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు మూడు శాతానికి పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.