Houses Distribution: 3లక్షల ఇళ్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..
ఇప్పటివరకు లక్ష మంది లబ్దిదారులకు 300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

Houses Distribution: ఏపీలో పేదల ఇళ్ల పంపిణీకి ముహుర్తం ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు చేయించాలని సర్కార్ సంకల్పించింది. పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వచ్చే శ్రావణ మాసంలో 3లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటివరకు లక్ష మంది లబ్దిదారులకు 300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు, పనులపై దృష్టి సారించింది కూటమి సర్కార్.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లపై దృష్టి సారించింది. మరికొన్ని రోజుల్లోనే పేదలకు ఇచ్చే ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేయాలని సంకల్పించింది. దీనికి సంబంధించి ఇప్పటికే దశల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమీక్ష చేశారు.
శ్రావణ మాసంలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిధుల విడుదల, పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. మరొక 50వేల ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసి శ్రావణ మాసంలో మొత్తం 3లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించింది.
ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని నెరవర్చే విధంగా కూటమి సర్కార్ ముందుకెళ్తోంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో సమీక్ష జరుగుతోంది.
లక్ష ఇళ్ల నిర్మాణానికి 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి.. మరోవైపు ఉపాధి హామీ పథకం నుంచి వచ్చే అన్ని నిధులను సమీకరించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు 3 లక్షల ఇళ్లను ఒకేసారి పంపిణీ చేయడానికి ముహూర్తం ఖరారైంది. శ్రావణ మాసంలో పూర్తైన ఇళ్లను పేదలకు అందించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.