రాజధాని తేల్చేస్తారా : జగన్‌తో హై పవర్ కమిటీ భేటీ

ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌తో మూడోసారి సమావేశం కానుంది. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. రాజధానితో పాటు అమరావతి రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. పాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఇప్పటికే రెండుసార్లు సీఎంతో సమావేశమైన కమిటీ.. శుక్రవారం జరగబోయే తుది సమావేశంలో రాజధాని అంశాన్ని తేల్చే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీ సూచించే పక్షంలో.. ఉద్యోగుల తరలింపు ప్రక్రియపై కూడా చర్చ జరిగే అవకాశముంది. తక్షణం ఉద్యోగులను విశాఖకు తరలిస్తే.. అక్కడ ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించి సమావేశంలో చర్చించవచ్చు. కమిటీ తుది నివేదికను ఈనెల 20న ప్రభుత్వానికి సమర్పించే ఛాన్సుంది. అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.
CRDA చట్టాన్ని మార్చే అంశంపై హైపవర్ కమిటీ ప్రతిపాదనలు చేయనుంది. CRDA పరిధిలో తీసుకోవాల్సి అభివృద్ధిపై నివేదికలో పొందుపర్చాలనుకుంటోంది. రైతుల్లో ఎక్కువ మంది భూములు వెనక్కి తీసుకొనేందుకు నిరాకరిస్తున్నందున.. అమరావతి ప్రాంతాన్ని ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్, మెడికల్ జోన్‌గా అభివృద్ధి చేయాలని.. తద్వారా అమరావతి వాసులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై హై పవర్ కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రాజధానిలో నిర్మాణాలపై కూడా కమిటీ చర్చించనుంది. నిర్మాణం పూర్తైన వాటిని ఎలా వినియోగించుకోవాలో సూచించే అవకాశముంది. సెక్రటేరియట్‌ను ఉన్నత ప్రమాణాలు ఉండే విద్యాసంస్థగా కానీ… హాస్పిటల్‌గా గానీ ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై హై పవర్ కమిటీ చర్చించనుంది. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, అధికారుల క్వార్టర్స్‌ను వారి కేడర్‌ను బట్టి కేటాయించాలనుకుంటోంది. వీటన్నింటిపై సాధ్యాసాధ్యాల్ని కమిటీ చర్చిస్తుంది.
ఇప్పటివరకు రెండుసార్లు సీఎంతో సమావేశమైన హైపవర్ కమిటీ పాలన వికేంద్రీకరణకే సూచనలు చేసింది. తాజా భేటీతో విశాఖలోనే పరిపాలన రాజధాని ఏర్పాటును ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం చెబుతున్నట్టు అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావచ్చు. మరోవైపు రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చంటూ ప్రభుత్వం విధించిన గడువు కూడా ఇవాళ్టితో ముగుస్తోంది. ఇప్పటి వరకు 18వేల 110 మంది మాత్రమే తమ అభిప్రాయాలను సీఆర్డీఏకు అందజేశారు. గడువు పెంచాలని రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో… మరో రెండు రోజులు పెంచాలా? లేక వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలా అన్న దానిపై కూడా హైపవర్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
Read More : శైలజానాధ్ రాకతో హస్తం దశ తిరుగుతుందా ?