Ippatam Demolitions : ఇప్పటంలో హైటెన్షన్.. ఇళ్ల కూల్చివేతలపై జనసేన నేతల ఆందోళన
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కూల్చివేతలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Ippatam Demolitions : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కూల్చివేతలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటంలో కూల్చివేతలపై జనసేనత నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇవాళ ఉదయం నుంచే కూల్చివేతలను అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ఇప్పటానికి చేరుకున్నారు. ఇళ్ల గోడలకు మున్సిపల్ అధికారులు వేసిన మార్కింగ్ లను తొలగించారు. అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇలా కూల్చివేయాలని నిర్ణయించడం దుర్మార్గం అన్నారు జనసేన నేతలు. రాజకీయంగా కక్ష కట్టి ఇళ్లను కూల్చివేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ జనసేన నేతలు స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకతో జనసేన నేతలు ఆలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇళ్ల కూల్చివేతలు ఆపేవరకు దీక్ష విరమించేది లేదని జనసేన నేతలు తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం 90శాతం అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. మిగిలిన అక్రమ కట్టడాలను సైతం కూల్చివేస్తున్నారు అధికారులు.
ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. మా ఇళ్ల జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90శాతం ఇళ్లను కూల్చేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. రెండు జేసీబీల సాయంతో 12 ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేశారు.
ఇప్పటం జనసేన పార్టీ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ప్రవారీ వరకు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చినందుకు మా ఇల్లు కూల్చివేస్తున్నారని ఇప్పటం గ్రామస్తురాలు లక్ష్మి కన్నీటిపర్యంతం అయ్యింది. 3 నెలలుగా మమ్మల్ని అధికారులు టార్చర్ పెడుతున్నారని.. మాకు తిండి లేదు, నిద్ర లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మేము స్వచ్ఛందంగా ఇల్లు ఇచ్చామని అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, అలాంటి వాదనల్లో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం ఇల్లు తొలగించారని, ఇప్పుడు ఆ మార్కింగ్ దాటి ఇల్లు తొలగిస్తున్నారని ఆమె వాపోయింది. మా ఇళ్ల జోలికొస్తే ఆత్మహత్య చేసుకుంటామని, మా శవం మీద నుంచి జేసీబీ తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.