జరభద్రం, కడప జిల్లాలోని గొల్లపల్లి వంక బ్రిడ్జికి రంధ్రం

  • Published By: madhu ,Published On : September 19, 2020 / 01:35 PM IST
జరభద్రం, కడప జిల్లాలోని గొల్లపల్లి వంక బ్రిడ్జికి రంధ్రం

Updated On : September 19, 2020 / 2:26 PM IST

కడప జిల్లాలో గొల్లపల్లి వంక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గరున్న ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దానిపై ప్రయాణిస్తున్న వారు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 2020, సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి కడప – తాడిపత్రి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.



శనివారం ఉదయం వరకు బ్రిడ్జికి ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి. అధికారులు స్పందించకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వల్లూరు మండలం అచ్యుతరాయ పల్లె గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. కడప – అనంతపురానికి వెళ్లే గొల్లపల్లి వంక బ్రిడ్జిపై రంధ్రం ఏర్పడిందని తెలుసుకున్న పోలీసులు తగు చర్యలు చేపడుతున్నారు.



అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కడపలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న కుంటలు, చెరువులు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండికోట ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరగడంతో ముంపు ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.