నవ్యాంధ్రను నడిపించడంలో సీఎం చంద్రబాబు మార్క్.. నెల రోజుల పాలనలో కీలక నిర్ణయాలు

how is Chandrababu Naidu 30 days rule in Andhra Pradesh Explained here
Chandrababu Naidu 30 days rule: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం. సంక్షోభాలను దాటి.. ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం. సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు. తాము చెప్పిన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం. ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు నెల రోజుల పాలన కొనసాగింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. పెన్షన్ల పెంపుతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పేరు తెచ్చుకున్నారు. అధికారం అంటే పదవి కాదు.. బాధ్యత అని నెల రోజుల్లోనే చేసి చూపించారు చంద్రబాబు.
పెన్షన్ల పెంపుతో తొలి అడుగు
ఏవో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాం.. అని లైట్ తీసుకోవడం లేదు. ప్రతీదానికి గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కాలయాపన చేసే ఉద్దేశం కూడా కనిపించడం లేదు. చెప్పాం.. మాటిచ్చినట్లు చేసి తీరాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. పెన్షన్ల పెంపుతో తొలి అడుగు వేసిన చంద్రబాబు.. ఓ రకంగా విమర్శలకు చెక్ పెట్టారు. రూ.3వేలున్న పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని.. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లుగా అమలు చేసి చూపించింది ఎన్డీఏ సర్కార్. ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ బకాయిలను కలిపి వృద్దులకు ఏడు వేల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం.
ఫ్రీ బస్సు పథకం అమలుపై ఫోకస్
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే పెన్షన్ల వంటి అతిపెద్ద పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఏపీ సర్కార్. తల్లికి వందనం కింద ఇంటర్మిడియట్ వరకు చదువుకునే పిల్లల పేరెంట్స్‌కు ఏడాదికి 15వేలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. ఫ్రీ ఆర్టీసీ బస్సు పథకం అమలుపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ, కర్ణాటకలో స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌పై స్టడీ చేస్తున్నారు అధికారులు. ఆ రిపోర్ట్ రాగానే ఫ్రీ బస్ ఫెసిలిటీ అమలుకు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. ఇక రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయంపైనా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు సర్కార్.. పెట్టుబడిసాయం కింద 20వేల రూపాయలు అందించనుంది. మరోవైపు నిరుద్యోగులకు కీలకమైన టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ఎఫెక్టివ్ గవర్నెన్స్.. పబ్లిక్ అట్రాక్ట్
మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్దివైపు అడుగులు వేశారు బాబు. ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెడుతూ.. ప్రక్షాళన మొదలు పెట్టారు. అశాంతి, అధికార అహంకారానికి చోటు లేకుండా.. హంగామా, హడావుడి లేకుండా నవ్యాంధ్రలో నెల రోజుల పాలనను పూర్తి చేశారు చంద్రబాబు.
పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..
సీఎంగా బాధ్యతలు చేపట్టినరోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన బాబు.. ఇప్పటికే 16వేల 347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రాసెస్ జరుగుతోంది. పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేసేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ఆగస్ట్‌లో మళ్లీ ఓపెన్ చేయనున్నారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాస్ పుస్తకాల అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలివారంలోనే పోలవరం, ఆ తర్వాత రాజధాని అమరావతిలో పర్యటించి తమ ప్రాధాన్యతలు ఏంటో చెప్పకనే చెప్పారు చంద్రబాబు.
Also Read : చంద్రబాబు కీలక నిర్ణయం.. కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ సూచన
ఇక వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత కారణమై.. టీడీపీ ప్రచార అస్త్రంగా వాడుకున్న ఉచిత ఇసుక పాలసీపై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఇసుక రేట్లు పెంచడంతో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగమైంది. సీఎం అయిన నెలరోజుల్లో ఉచిత ఇసుక విధానం అమలు చేసి.. భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగానికి తిరిగి పునర్ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా.. ఎక్కడున్నారు, ఏమైపోయారు?
రెండ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం.. ఏపీకి విరివిగా నిధులు ఇవ్వాలని వినతిపత్రాలు అందజేశారు.