Huge investments: ఆంధ్రాకు పరిశ్రమల వెల్లువ.. భారీగా పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Huge investments: ఆంధ్రాకు పరిశ్రమల వెల్లువ.. భారీగా పెట్టుబడులు

Jagan

Updated On : November 17, 2021 / 1:46 PM IST

Huge investments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటి ద్వారా 2వేల 134 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలోని 7వేల 683మంది యువతకు ఉపాధి లభించనుంది.

పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. భవిష్యత్తులో విస్తరణకు అవకాశాలు ఉన్నచోట భూములు కేటాయించాలని సూచించారు.

కడపజిల్లాలోని పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. రూ.110కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న సంస్థలో జాకెట్స్‌, ట్రౌజర్ల తయారీ చేపట్టనున్నారు. ఈ పెట్టుబడితో 2వేల 112మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

ఇదే జిల్లాలోని బద్వేలులో సెంచురీ సంస్థ నెలకొల్పబోతున్న ఫ్లైవుడ్‌ తయారీ పరిశ్రమకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 956 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా 2వేల 266మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించబోతుంది.

కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు అనుమతి లభించింది. కొప్పర్తి ఈఎంసీ లోనే మరొక పరిశ్రమ పెట్టడానికి ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకు రావడంతో… దానికీ ఆమోదం తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మరో కంపెనీ ఏర్పాటు కానుంది. ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.