Swarna Gramam: ఏపీలో ఐఏఎస్ అధికారుల పల్లెబాట.. పల్లెనిద్రలు..

అందుకే సీఎం చంద్రబాబు అన్నీ ఆలోచించి ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని కూటమి వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

Swarna Gramam: ఏపీలో ఐఏఎస్ అధికారుల పల్లెబాట.. పల్లెనిద్రలు..

Updated On : April 4, 2025 / 8:20 PM IST

సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు, నాయకులు పల్లెబాట పడతారు. అవసరమైతే డచేస్తారు. కానీ ఏపీలో ఐఏఎస్ అధికారులు పల్లెబాట పట్టబోతున్నారు.. అధికారులే పల్లెకు పయనమయ్యే పథకం రాబోతోంది.. సీఎం చంద్రబాబు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారట. అధికారులకు ప్రజలతో కనెక్టివిటీ పెంచేందుకు ఏపీ సర్కార్ తీసుకురాబోతున్న ఆ పథకం ఏంటి? ఆ పథకంతో ప్రయోజనాలేంటి?

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎన్నో ప్రభుత్వాలు పల్లెనిద్ర చేపట్టాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు పల్లెబాట పట్టిన సందర్భాలున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు.. ఐఏఎస్‌ అధికారుల్ని పల్లెనిద్ర చేయాలని కోరుతున్నారు. ఈ మాట కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

మీరు హాయిగా పల్లెలకు వెళ్ళండి అక్కడి పచ్చని వాతావరణం చూడండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయంటూ చెప్పుకొచ్చారు సీఎం. రాజకీయ నాయకులుగా తాము ఎటూ జనంలో ఉంటూ అన్నీ చూస్తున్నామని.. మీరు కూడా వెళ్తే మంచి పరిపాలన చేయవవచ్చంటూ చెప్పుకువచ్చారు సీఎం చంద్రబాబు.

అయితే అప్పుడు సీఎం చంద్రబాబు సరదాగా చెప్పి ఉంటారని చాలా మంది భావించారు. కానీ ఇపుడు దానిని ఒక పాలసీగా ఏపీ సర్కార్ చేయబోతుందని అధికార వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారట. దాంతో ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులూ పల్లెలకు వెళ్ళాల్సిందే అని అంటున్నారు.

అంతేకాదు వారు అక్కడ మూడు రోజులు రెండు రాత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారనే వార్త ప్రచారంలో ఉంది. అధికారులు నేరుగా పల్లెలకు వెళ్లడం వల్ల ప్రజలతో మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో కూడా అధికారులకు తెలుస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట.

వెళ్లి సమస్యల్ని గుర్తించి నోట్ చేసుకోవాలి..
స్వర్ణ గ్రామం పథకం సీఎం చంద్రబాబుకు వచ్చిన ఉన్నతమైన ఆలోచన అంటూ కూటమి నేతలు చెబుతున్న మాట. ఎమ్మెల్యేలు పల్లెలకు వెళ్ళినా లేక నాయకులు వెళ్ళినా జనం చెప్పే బాధలను విని తిరిగి అధికారులకే చెప్పాలి. మళ్లీ అధికారుల ద్వారానే పనులు చేయించాలి. అదే అధికారులే నేరుగా పల్లెలకు వెళ్లి సమస్యల్ని గుర్తించి నోట్ చేసుకోవాలి. ఆ సమస్యలు ఎక్కడ తలెత్తాయో, ఎలా పరిష్కరించాలో ఓ ప్రణాళిక క్షణాల్లో రెడీ అవుతుంది. నిజానికి ఏ ప్రభుత్వ పాలనలోనైనా అధికారుల పాత్రే కీలకం.

అలాగే ఐఏఎస్ అధికారులు పాలసీ మేకర్స్ గా ఉంటారు. వారు వేరే చోట్ల పనిచేసి ఉంటారు కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే క్షేత్ర స్థాయి పరిస్థితుల మీద వారు అవగాహన పెంచుకోవాలి అంటే ఈ విధంగా పల్లెలకు వెళ్తెనే అది సాధ్యపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే సీఎం చంద్రబాబు అన్నీ ఆలోచించి ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని కూటమి వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

స్వర్ణ గ్రామం అన్న పేరు కూడా క్యాచీగా ఉండేలా పెట్టారని ఏపీ ప్రజల్లో టాక్. తమ వద్దకే కలెక్టర్లు కీలక అధికారులు వస్తే జనాలు వారికి సమస్యలు చెప్పుకుని చాలా వరకూ సంతృప్తి పడతారు. వాటిలో వెంటనే పరిష్కారమయ్యే సమస్యలు కూడా ఉంటాయి.

ఇక గ్రామాల్లో రెండు రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయడం ద్వారా ఎవరూ చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటారు. ఇలా ఇటు పాలనకు అటు ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వర్ణ గ్రామం పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని డిజైన్ చేశారట సీఎం చంద్రబాబు. మరి దీనిని ఎపుడు ప్రారంభిస్తారో, ఎలా అమలు చేస్తారోనని ఏపీ ప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.