వైసీపీ-బీజేపీ ఫోకస్ : డైలమాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే?

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించడం మినహా 1983 నుంచి నేటి వరకూ 8 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు.
ప్రస్తుతం ఇచ్ఛాపురం నియోజకవర్గానికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ బెందాళం అశోక్ ఇప్పుడు డైలమాలో ఉన్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఏం చేయాలా అనే డోలాయమానంలో ఉన్నారని అంటున్నారు. ఆయనపై అటు వైసీపీ, ఇటు బీజేపీ నేతలు ఫోకస్ పెట్టినట్లు జనాలు గుసగుసలాడుతున్నారు.
బెందాళం అశోక్‌ను తమ పార్టీలోకి రప్పించేందుకు వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు మంతనాలు సాగించారనే చర్చ సాగుతోంది. దీంతోపాటుగా బీజేపీకి చెందిన ముఖ్య నేతలు అశోక్ బంధువుల ద్వారా తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇచ్ఛాపురం ప్రస్తుత ఎమ్మెల్యేని పార్టీ మారేలా చేస్తే రెండు విధాలా లాభం ఉంటుందని బీజేపీ, వైసీపీ నేతలు భావిస్తున్నారట. ముఖ్యంగా కింజరాపు వర్గీయుడిగా ముద్రపడ్డ అశోక్‌ను లాగితే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులను ఒంటరి చేయవచ్చన్న భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోందంటున్నారు.
బెందాళం ఆశోక్ మౌనం :
మరోపక్క, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురు నేతల మధ్య వైసీపీ కేడర్ సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బీజేపీ కూడా రంగంలోకి దిగి అశోక్‌కు ఒక భరోసా ఇవ్వడం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో పట్టు సాధించవచ్చన్న అభిప్రాయంతో ఉందంటున్నారు.
అయితే డాక్టర్ బెందాళం అశోక్ మాత్రం ఇరు పార్టీలకు అంగీకారం తెలపకుండా మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగితే వచ్చే టెర్మ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందన్న అభిప్రాయం ఆయనలో ఉందంటున్నారు.
ఎటు తేల్చుకోలేక :
రాజకీయంగా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ, బీజేపీ నేతలకు క్లారిటీ ఇవ్వకుండా బెందాళం అశోక్ తన పని తాను చేసుకుంటున్నారట. వైసీపీలో ఇప్పటికే బహు నాయకత్వ సమస్య వేధిస్తోంది. మరోపక్క, బీజేపీని కేడర్ లేమి వెంటాడుతోంది. ఈ సమస్యలతో శ్రీకాకుళం జిల్లాలో ఆ రెండు పార్టీలు సతమతం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే పార్టీ మారి లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో అశోక్ ఉన్నారట. ప్రస్తుతానికి పార్టీ ఫిరాయిస్తే ఇటు కేడర్‌తో పాటు తన రాజకీయ భవితవ్యం కూడా ఇరుకునపడే అవకాశాలే ఎక్కువ ఉండడంతో అశోక్ ఎటూ తేల్చుకోని డైలమాలో ఉన్నారని చెబుతున్నారు.