చిరుద్యోగి కోట్లకు పడగెత్తాడు…విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 09:33 PM IST
చిరుద్యోగి కోట్లకు పడగెత్తాడు…విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట

Updated On : August 20, 2020 / 10:13 PM IST

ఓ చిరుద్యోగి విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట పట్టాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లకు పడగెత్తాడు. చివరికి పోలీసులు వలలో పడ్డాడు. అనంతపురంకు చెందిన మనోజ్ కుమార్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అనతికాలంలోనే రూ.కోట్లు కూడబెట్టాడు. అతడి తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కింద మనోజ్ కు 15 ఏళ్ల కిందట జిల్లా ట్రెజరీ డిపార్ట్ మెంట్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ గా ఉద్యోగం ఇచ్చారు. తొలి రోజుల్లో కార్యాలయానికి పాత సైకిల్ పై వెళ్లేవాడు. రెండేళ్లల్లోనే పూర్తిగా మారిపోయాడు. దొంగ బిల్లులు రాయడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం, పదవీ విరమణ ఉద్యోగుల బిల్లులు రాయడం వంటివి ప్రారంభించాడు.

రూ.3 కోట్లకు పైగా ఆస్తులు
బుక్కరాయసముద్రంలో పోలీసులు పట్టుకున్న బంగారు, వెండి ఆభరణాల విలువ ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రూ.1.82 కోట్లుగా తేల్చారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు నగదు నిల్వలు రూ.91,15,000గా గుర్తించారు. వీటికితోడు వాహనాల విలువ రూ.లక్షలు ఉండొచ్చు. ఒక సాధారణ ఉద్యోగి 15 ఏళ్లలో రూ.3 కోట్లకు పైగా సంపాదించడం సాధ్యమా.. అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఆయన వెంట 10 మంది యువకులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తున్నాడంటే అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా మనోజ్ కుమార్ బినామీగా ఉన్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అతడి వద్ద ఉన్న గుర్రాలపై గతంలో ఓ పోలీస్ అధికారి సవారీ నేర్చుకునేవాడని చెబుతున్నారు. ఆయనతో పరిచయాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇద్దరు కలిసి పంచాయతీలు చేశారా? అనే అనుమానాలు ఉన్నాయి.

స్వామీజీ భక్తుడు…
మరోవైపు వెండి సామాగ్రి పరిశీలిస్తే వాటిని ఆశ్రమాల్లో ఉపయోగించేలా ఉన్నాయి. దీంతో ఎవరైనా స్వామీజీకి చెందిన ఆభరణాలు అయి ఉండవచ్చని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు జిల్లాకు చెందిన ఓ స్వామీజీకి భక్తుడిగా చెబుతున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే తాడిపత్రి, బెంగుళూరు, హైదరాబాద్ లలో నివాస స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులో ఓ వ్యక్తిని బెదిరించి కొంత భూమిని రాయించుకున్నాడని సమాచారం. రికార్డుల పరిశీలన, దస్త్రాలు తయారు చేయడంలో నైపుణ్యం ఉంది. బుక్కరాయ సముద్రం సమీపంలో ప్రస్తుతం లీజుకు తీసుకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమికి కూడా అతని బినామీ ఆస్తిగా తెలుస్తోంది.

అధికారులు హెచ్చరించినా మారని తీరు…
మనోజ్ కుమార్ అక్రమాలపై జిల్లా ట్రెజరీ డిపార్ట్ మెంట్ అధికారులు హెచ్చరించేవారు. అయినా లెక్క చేయలేదు. ట్రెజరీ డిపార్ట్ మెంట్ ల్లోనే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, ఇతర బిల్లులు పాస్ చేయిస్తున్నాడు. ఇంక్రిమెంట్లకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బిల్లులు తయారు చేయడం, ఉద్యోగం చేస్తూ చనిపోతే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. లక్షల్లో వసూలు చేశాడు. అధికంగా బిల్లులు రాసివ్వడం, ఆ సొమ్ము పంచుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డాడు. మరోవైపు విధులకు తరచూ గైర్హాజరవుతున్నాడు. ఉదయం 10:30 గంటలకు కారులో కార్యాలయానికి రావడం, హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోవడమే ఆయన ఆనవాయితీ. ఎవరైనా ప్రశ్నించినా బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

ముగ్గురు బాడీగార్డులు
నిత్యం ఉదయం గుర్రాలపై స్వారీ చేయడం.. గుర్రం వెనుక ముందు ముగ్గురు ప్రైవేటు బాడీగార్డులు పరుగులు తీయడం నిత్యం జరిగే ప్రక్రియ. బైక్ వాహనం లేదా కారులో కార్యాలయానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లినా గార్డులను వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. చేతి రుమాలు, తాగునీరు సీసా పట్టుకోవడానికి ఒకరుంటున్నారు. గుర్రాలు మేపడానికి, సంరక్షించడానికి జీతగాళ్లను నియమించుకున్నాడు.

నాగలింగం ఎవరు?
నిందితుడు మనోజ్ కారు డ్రైవర్ నాగలింగం వైసీపీ కార్యకర్తగా చలామణి అవుతున్నాడు. బుక్కరాయ సముద్రానికి చెందిన డ్రైవర్ తన మామ ఇంట్లోనే 8 ట్రంకు పెట్టెలను దాచిపెట్టారు. నాగలింగం వైసీపీ కార్యకర్త కావడంతో ఆ పార్టీ నాయకుల సొమ్ముగా ప్రచారం సాగింది. పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. నిందుతుడికి బుక్కరాయ సముద్రంలో ఇద్దరు యువకులు బినామీలు ఉన్నట్లు సమాచారం. తాడిపత్రిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి అత్యంత సన్నిహితం అని తెలుస్తోంది. ఆయన సహకారంతో అక్కడ ఆస్తులు కూడబెట్టాడని ప్రచారం ఉంది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.

రియల్ ఎస్టేట్ దందా..
నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు సీసీఎస్ సీఐకు సమాచారం అందించారు. ఓ ఇంట్లో మరణాయుధాలు దాచాడని తెలిపారు. దీంతో సీసీఎస్ పోలీసులు ఎస్సీ దృష్టికి తీసుకెళ్లి దాడులు చేశారు. మనోజ్ కుమార్ గత పదేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. భూ దందాలు, ఇళ్లు కొనుగోళ్లలో పంచాయితీలు.. వాటిలో వాటాలు లాక్కోవడం షరా మామూలే. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా రూ. కోట్ల ఆస్తులు దాచిపెట్టాడని సమాచారం.

నకిలీ తుపాకీలు
పోలీసుల తనిఖీల్లో నాలుగు తుపాకీలను గుర్తించారు. అవి నిజమైన తుపాకీలను పోలి ఉన్నాయి. వీటిని పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. నిశితంగా పరిశీలించిన తర్వాత అవి నకిలీవిగా తెలిసింది. అయితే నిందితుడి వద్ద నిజమైన తుపాకీ ఉన్నట్లు సమాచారం. పోలీసులకు లభించకుండా దాచినట్లు తెలుస్తోంది. 2.42 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి, రూ.15,55,560 నగదు, ఫిక్స్ డ్ డిపాజిట్ల బాండ్ల విలువ 49.10 లక్షలు, ప్రామిసరీ నోట్ల విలువ 27.05 లక్షలు, 6 బైక్ లు, 2 కార్లు, 4 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.