నాన్ వెజ్ ప్రియులా..ఫుల్లుగా లాగిద్దాం అనుకుంటున్నారా..ఆగండి

  • Published By: madhu ,Published On : October 4, 2020 / 01:03 PM IST
నాన్ వెజ్ ప్రియులా..ఫుల్లుగా లాగిద్దాం అనుకుంటున్నారా..ఆగండి

Updated On : October 4, 2020 / 1:13 PM IST

Illegal Mutton Transportation : మీరు నాన్‌వెజ్ ప్రియులా.. వీకెండ్స్ కదా… ఫుల్లుగా లాగిద్దాం అని ప్రిపేర్ చేస్తున్నారా.. ఒక్క నిమిషం. మీరు కొంటున్నది.. కొనుక్కొచ్చింది తాజా మాంసమో కాదో చెక్ చేసుకొండి.. లేదంటే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. వీకెండ్ రాగానే.. ముందుగా గుర్తుకొచ్చేది.. చికెన్, మటన్. ఆ తర్వాతే చేపలు, రొయ్యలు. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా మటన్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు. తెల్లారడమే ఆలస్యం.. మాంసం కోసం వెళ్లిపోతుంటారు. ఇక పార్టీ ప్రియుల సంగతి సరేసరి. ముక్క ఉంటే కానీ మజా ఉండదనుకునే కాన్సెప్ట్ వాళ్లది.



కరోనా పుణ్యమా అని… ఇన్నాళ్లూ మటన్, చికెన్ షాపులు వెలవెలబోయినా… ఇప్పుడు మాత్రం జనాలు మాంసం కొనేందుకు ముందుకొస్తున్నారు. ఇక వీకెండ్ కావడంతో.. ఎక్కువమంది జనాలు మటన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. మాంసం ప్రియులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ న్యూస్ చెప్పింది.



మాంసం కొనేముందు జర భద్రం అంటూ హెచ్చరించింది. ఎందుకంటే.. విజయవాడలో మటన్ మాఫియా రెచ్చిపోతోంది. జనాల వీక్‌నెస్‌‍ను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. ఎన్నో రోజుల నుంచి నిలువ ఉంచిన మాంసాన్ని అంటగట్టి సొమ్ము చేసుకుంటోంది. సొమ్ము చేసుకోవడమే కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు అమ్ముతూ కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టిస్తోంది.



తాజాగా ఇతర రాష్ట్రాల నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న పోటెళ్ల మాంసంను రైల్వే పార్సిల్ కార్యాలయంలో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సీజ్ చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 16 పార్సిల్ బాక్సులలో ఢిల్లీ నుంచి విజయవాడకు నిల్వ ఉంచిన మాంసం వచ్చినట్లు గుర్తించారు. వీకెండ్స్‌ కావడంతో.. నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు అమ్మేందుకు మటన్ మాఫియా ప్రణాళికలు రూపొందించింది.



అయితే.. సమాచారం అందుకున్న కార్పోరేషన్ అధికారులు రైల్వే పార్సెల్ కార్యలయంలో తనిఖీలు నిర్వహించారు. మాఫియా ఆట కట్టించారు. ఢిల్లీ, ఒడిషా నుంచి.. విజయవాడకు పొట్టేళ్ల తలకాయలు, కాళ్ల మాంసం తరలిస్తున్నట్లు గుర్తించారు. 16 బాక్సుల్లో మాంసాన్ని సీజ్‌ చేశారు.
గత కొన్ని రోజులుగా ఇదే తంతు సాగుతోందని అధికారులకు పక్కాగా సమాచారం అందింది.



దీంతో.. సోదాలు చేసి నిల్వ ఉంచిన మాంసాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై బెజవాడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో పాటు వివిధ రకాల వ్యాధులతో అల్లాడుతుంటే, డబ్బుల కోసం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు మటన్ మాఫియా తెగబడటంపై భగ్గుమంటున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ మధ్య ప్రజలు ఎక్కువగా మాంసం తింటున్నారు.అయితే.. ఎక్కడపడితే అక్కడ కాకుండా.. కబేళాలో మాత్రమే మాంసం కొనుగోలు చేయాలని విజయవాడ మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.