Andhra Pradesh: రాజశ్యామల యాగంలో సీఎం జగన్.. విశాఖలో చంద్రబాబు పర్యటన షురూ.. ఏపీ న్యూస్ అప్‌డేట్స్
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. మూడు రోజులు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు..

C M Jagan and chandrababu
Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం నేటితో ముగియనుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రోజు జరిగే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో నేటినుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలా.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
తణుకు సబ్ స్టేషన్లో మంటలు..
పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. గత రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల తణుకు 132కెవి సబ్ స్టేషన్ అగ్నికి ఆహుతైంది. దీంతో అత్తిలి ఇరవరం మండలాల్లోని గ్రామాల్లో అంధకారం నెలకొంది.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి..
ఎన్టీఆర్ జిల్లా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప మాధవరం శివారు మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి చేశారు. మైలవరం, రెడ్డిగూడెం ఎస్సైలు పేకాట ఆడుతున్న జుదరులపై దాడి చేసి.. ఆరుగురు వ్యక్తుల నుండి రూ..1,20,000/- ల నగదు, రూ.12 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం..
ప్రకాశం జిల్లా దర్శి మండలం బోధనంపాడు సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు పూరిమెట్లకు చెందిన కాకర్ల ఖాసీం, గాయపడ్డ మహిళ కాకర్ల పీరమ్మగా గుర్తించారు. వీరిద్దరూ భార్యభర్తలు . వీరు అలవలపాడు గ్రామంలో తమ బంధువులకు చెందిన కర్మకాండలు ముగించుకొని తమ స్వగ్రామం పూరిమెట్లకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపురం నుండి పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామంకు కూలీలతో ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు భూక్య పద్మ (25), వర్త్య సక్రి (32),ఇస్లావత్ మంజుల (25),భూక్య సోనీ (65)5 మాలోత్ కవిత( 33)గా పోలీసులు గుర్తించారు.
తిరుమల సమాచారం ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం శ్రీవారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు నమోదైంది. తిరుమలలో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన..
నేటి నుంచి 3రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పెందుర్తి, ఎస్.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. మూడు రోజుల పాటు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గోనున్నారు. ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకోనున్న చంద్రబాబు.. మహిళా ప్రగతి కేంద్రం వద్ద పంచగ్రామ భూ బాధితుల సమస్యలు తెలుసుకోనున్నారు. లక్ష్మీ హాస్పిటల్, శాంతి కళ్యాణ మండపం, కాస్మోస్ ప్రైమరీ స్కూల్‌ల మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. రాత్రికి పెందుర్తి జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి సరిపల్లె గ్రామంలో చంద్రబాబు బస చేస్తారు. రేపు (గురువారం) శృంగవరపు కోట, 19వ తేదీన అనకాపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుంది.
రాజశ్యామల యాగం..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం నేటితో ముగియనుంది. బుధవారం ఉదయం సీఎం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుని అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నాలుగు ప్రధాన యాగశాలలో 108 కుండలాల్లో హోమాలతో యాగం ముగియనుంది.