రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి

తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు.

రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి

Dollars Divakara Reddy

Updated On : January 6, 2024 / 12:30 AM IST

Dollars Divakara Reddy : చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టేందుకు ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సై అంటున్నారు. చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్‌గా పులివర్తి నాని ఉన్నప్పటికీ టిక్కెట్ మాత్రం తనకే దక్కుతుందని డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించి చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగరేస్తానని దివాకర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. దీంతో అందరి దృష్టి చంద్రగిరిపై పడింది.

చంద్రబాబు పురిటిగడ్డ చంద్రగిరి.. కాంగ్రెస్ కంచుకోట..
టీడీపీ అధినేత చంద్రబాబు పురిటిగడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని విడిచి.. కుప్పంకు మకాం మార్చారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మధ్యలో ఓసారి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. మొత్తం నాలుగు సార్లు గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ తరఫున జయకేతనం ఎగురవేశారు.

చంద్రగిరి టికెట్ ఆశిస్తున్న డాలర్స్ దివాకర్ రెడ్డి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైసీపీ నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన గల్లా అరుణ కుమారిని ఓడించగా, 2019లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై విజయం సాధించారు. ప్రస్తుతం పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే చంద్రగిరి టీడీపీ టికెట్ డాలర్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశిస్తున్నారు.

Also Read : వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పని చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డి..
డాలర్స్ దివాకర్ రెడ్డి స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్ళపల్లి గ్రామం. తిరుపతిలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. MBA పూర్తి చేసి, ఆర్థిక శాస్త్రంలో PHD పట్టా అందుకున్నారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలో దివాకర్ రెడ్డికి పెద్ద ఎత్తున బంధువులున్నారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో దివాకర్ రెడ్డి చురుగ్గా పనిచేశారు. యువరాజ్యం జిల్లా అధ్యక్షుడుగానూ కొనసాగారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ చంద్రగిరి టికెట్ ఆయనకు తృటిలో మిస్సైంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత డాలర్స్ దివాకర్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి పెట్టారు.

డాలర్స్ గ్రూప్ పేరుతో వ్యాపార సామ్రాజ్యం..
డాలర్స్ గ్రూప్ పేరిట ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు దివాకర్‌ రెడ్డి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. డాలర్స్ రియల్ ఎస్టేట్ సంస్థను మరింతగా విస్తరించారు. దివాకర్ రెడ్డి కాస్త డాలర్స్ దివాకర్ రెడ్డిగా మారిపోయారు.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

సంపాదనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా..
బెంగళూరులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సినీ రంగంతోనూ ఆయనకు పరిచయాలున్నాయి. అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. కేవలం సంపాదనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి చురుకుగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు ప్రోత్సాహకాలు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, క్రీడాకారులకు చేయూత, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల సాయం చేస్తున్నారు. చెస్, జూడో, బ్లైండ్ క్రికెట్, టి10 క్రికెట్… తదితర క్రీడా సంఘాలకు, పలు కార్మిక సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగుతున్నారు డాలర్స్ దివాకర్‌రెడ్డి.

చంద్రగిరి టికెట్ పై ఆశలు..
రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని డాలర్స్ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే డాలర్స్ దివాకర్‌రెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ, కుల సమీకరణ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ టికెట్ తనకు కేటాయించాలని దివాకర్ రెడ్డి కోరుతున్నారు.

చంద్రగిరి కోటలో పసుపు జెండా ఎగరేస్తానని ధీమా..
తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో తనకు అనుచరగణం ఉన్నారని, వారందరి మద్దతుతో చంద్రగిరి కోటలో పసుపు జెండా ఎగురవేస్తానని దివాకర్ రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని డాలర్స్ దివాకర్‌రెడ్డి కోరుతున్నారు.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

మొత్తంమ్మీద చంద్రగిరి టికెట్ విషయంలో టీడీపీ అధిష్టాన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డాలర్స్ దివాకర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాలను చుట్టేశారు. మరికొన్ని రోజుల్లోనే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ టికెట్ విషయంపై ఓ క్లారిటీ రానుంది.