వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.

వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

Rayadurgam MLA Kapu Ramachandra Reddy Resign For ycp

Kapu Ramachandra Reddy : వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జిలను మారుస్తూ సీఎం జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆ పార్టీలో కొన్ని చోట్ల చిచ్చు రాజేస్తున్నాయి. టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. ఏకంగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మినందుకు గొంతు కోశారు, ఘోరంగా అవమానించారు అని వాపోయారు. చెత్త సర్వేలు అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నేను, నా భార్య లేదా కొడుకు పోటీ చేస్తామని ప్రకటించారు.

జగన్ కోసం పదవిని వదులుకున్నా..
”జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చాం. గతంలో మంత్రి పదవి ఇస్తా అన్నారు. పదవి ఇవ్వలేదు. సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారు. దరిద్రపు సర్వేలు చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నేను, నా భార్య పోటీలో ఉంటాం. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేస్తాం. నమ్మినందుకు గొంతుకోశారు. ఇంతకంటే అవమానం లేదు. ఏ పార్టీలో అవకాశం వచ్చినా పోటీ చేస్తాం. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా” అని సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు రామచంద్రారెడ్డి.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదు..
2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఐదేళ్లు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండాల్సిన అవకాశం నాకున్నా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీదున్న ప్రేమతో ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని జగన్ ను నమ్మి వచ్చా. పలు సార్లు టికెట్ వద్దన్నా, మంత్రి పదవి ఇస్తామని 2014, 2019లో చెప్పారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా వైఎస్ కుటుంబం మీదున్న అభిమానం, గౌరవంతో ఏరోజు కూడా ఏమీ అడగలేదు. జగన్ ఏం చెబితే అది చేశాం. గడప గడపకి తిరిగాము. ఎంతో కష్టపడి పని చేశాం. మంచి జరిగిందా ముఖ్యమంత్రి నుంచే, చెడు జరిగిందా ముఖ్యమంత్రి నుంచే. మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని పిలిపి సర్వే రిపోర్టు బాగోలేదని, నీకు టికెట్ లేదని చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉంది.

దరిద్రపు సర్వేలు.. నేను, నా భార్య కచ్చితంగా పోటీ చేస్తాం..
నా సొంత ఊరు కళ్యాణదుర్గం. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ రాయదుర్గం నుంచి మేము పోటీ చేస్తున్నాం. కళ్యాణదుర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున తప్పకుండా నేను పోటీ చేసి గెలుస్తాను. నాపై ప్రజల్లో అంత అభిమానం ఉంది. ఈ దరిద్రపు సర్వేలు నాకొద్దు. రాయదుర్గంలో కూడా నా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి అవకాశం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాం.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటాను..
టికెట్ ఇవ్వకూడదని ముందే నిర్ణయం తీసేసుకున్నారు. మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మీకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పి పంపేశారు. ఎంత అడిగినా కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటాను. ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. పోటీ చేయడం మాత్రం పక్కా. కళ్యాణదుర్గం, రాయదుర్గం.. రెండు చోట్లా పోటీ చేసి తీరతాం” అని కాపు రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు.

ఇంతకన్నా పెద్ద అవమానం లేదు..
”ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం జగన్ తో మాట్లాడేందుకు వేచి చూశాం. కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. నమ్మినందుకు గొంతు కోయడం ఒక్కటే మిగిలింది. మా జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నాం. నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి తప్పకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. ఎక్కడి నుంచైనా సరైన అవకాశం వస్తే అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

Also Read : సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?

మా గొంతు కోస్తాడని ఎన్నడూ ఊహించలేదు..
జగనే నా సర్వస్వం అని నమ్మాను. జగన్ ని మా దేవుడితో సమానంగా చూశాను. వైఎస్ఆర్ ఫోటోను మా ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకున్నాం. అలాంటి మమ్మల్ని ఈ విధంగా గొంతు కోస్తారని ఏ రోజూ ఊహించలేదు. మా ఇంట్లో ఎక్కడ చూసినా జగన్, వైఎస్ఆర్ ఫోటోలే కనిపిస్తాయి. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు, ఆయన కుమారుడు జగన్ మా గొంతు కోస్తాడని ఏనాడూ ఊహించలేదు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాపు రామచంద్రారెడ్డి.