Grandhi Srinivas: కమలం గూటికి గ్రంధి శ్రీనివాస్? బీజేపీ లెక్కలు ఎలా ఉన్నాయంటే?
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.

MLA Grandhi Srinivas
Grandhi Srinivas: గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ అవుతోంది. గతేడాది వైసీపీకి రాజీనామా చేసిన ఆయన అప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వైసీపీలో ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదని అప్పట్లో అసంతృప్తులు వినిపించాయి.
గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా ఆయన ఆశ నెరవేరలేదు. ఈ క్రమంలో వైసీపీ ఓడినప్పటి నుంచి పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. పైగా ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో అప్పట్లోనే మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని సమావేశమై చర్చించారు. ఆ తర్వాత అటు వైసీపీలో కొనసాగలేదు. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరలేదు గ్రంధి శ్రీనివాస్.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు
లేటెస్ట్‌గా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి కలిశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలోని గ్రంధి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్రమంత్రి వర్మ గ్రంధి ఇంటికి వెళ్లి భేటీ అవడం, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రంధి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకు కేంద్రమంత్రి వర్మ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నప్పటికీ..ఇది రాజకీయ భేటీనే అన్న టాక్ అయితే వినిపిస్తోంది.
బీజేపీలోకి ఆహ్వానించారని ఉహాగానాలు
పరామర్శ కోసమే వెళ్లినా పనిలో పనిగా గ్రంధి శ్రీనివాస్‌ను బీజేపీలోకి ఆహ్వానించారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణలతో భీమవరంలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి పవన్ కల్యాణ్‌పై విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రంధి శ్రీనివాస్..2024లో వైసీపీ తరఫున జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుపై ఓడిపోయారు.
గతేడాది డిసెంబర్ నెలలో వైసీపీకి రాజీనామా చేసినప్పటినుంచి ఏ పార్టీలో చేరకుండానే స్తబ్దతగా ఉండిపోయారు. (Grandhi Srinivas)
స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పార్టీ బలోపేతం చేసే దిశలో నరసాపురం పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ. గ్రంధి శ్రీనివాస్ కాపు లీడర్. మంచి పేరున్న నేత. ఆయన అనుభవం, పరిచయాలు తోడైతే నరసాపురం పార్లమెంట్, భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు..గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు.
అయితే బీజేపీ నేతల ఆహ్వానానికి ఆలోచించి చెప్తానన్నారట గ్రంధి శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం దాదాపుగా కన్ఫామ్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే గతంలోనూ టీడీపీలో చేరుతారని ఇంతే బలంగా ప్రచారం జరిగింది.
కానీ అలా వార్తలు వచ్చి ఆరేడు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు గ్రంధి. మరి ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతారా లేదా అన్నది ఆయన అఫిషీయల్‌గా చెప్తే తప్ప క్లారిటీ లేదు. కాకపోతే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఇప్పడే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టీవ్‌గా పనిచేయాలనైతే అనుకుంటున్నారట గ్రంధి.