CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు

రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు దొంతి మాధ‌వ‌రెడ్డి కూడా ఆయన పాద‌యాత్రను న‌ర్సంపేట‌కు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న దొంతి..ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్‌ను లైట్ తీసుకుంటున్నారన్న చర్చ ఉంది.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు

CM Revanth Reddy

Updated On : August 19, 2025 / 8:49 PM IST

CM Revanth Reddy: పవర్‌లో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా..సీఎం రేవంత్‌కు అప్పుడు..ఇప్పుడు ఇద్దరితో ఇక్కట్లు తప్పడం లేదట. పైగా వాళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయి ఉండి..నెగెటివ్ రాగం వినిపిస్తుండటం రేవంత్‌కు ఇరిటేషన్‌గా మారిందట. అలా అని వారిని ఏం అనలేని పరిస్థితి ఉందట. పొమ్మని పార్టీ నుంచి పంపే పరిస్థితిలేదు. అలాగని వారితో కలిసి డయాస్‌ షేర్ చేసుకునే సిచ్యువేషన్ లేదట.

అందులో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అయితే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎంపై చిందులు తొక్కుతున్నారు. మంత్రి ప‌ద‌విని రానివ్వకుండా అడ్డకున్నారంటూ రేవంత్‌పై బాణాలు వదులుతున్నారు. మొద‌ట్లో ఎక్స్ వేదిక‌గా ట్వీట్లు చేశారు రాజగోపాల్‌రెడ్డి. ఆ త‌ర్వాత ఇన్ డైరెక్ట్‌ కామెంట్స్‌తో హీట్ క్రియేట్‌ చేసి ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్‌తో తాడోపేడో అన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తున్నారు.

Also Read: Andhra Pradesh MLAs: ఎమ్మెల్యేలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ఇరికిస్తుంది.. ఇప్పటికే ఏం జరిగిందంటే?

కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవ‌హారం అలా ఉంటే..మ‌రో ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి మాట‌ల‌తో కాకుండా చేతలతో సీఎం రేవంత్‌ ( CM Revanth Reddy )ను ఇర‌కాటంలో పెడుతున్నార‌ట‌. సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి అటెండ్‌ అయ్యే స‌మావేశమేదైనా ఆయన డుమ్మా కొడుతున్నారు.

ముఖ్యమంత్రి ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మీక్షా స‌మావేశం నిర్వహిస్తే..మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ హాజ‌రైతే..జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఉండి కూడా దొంతి మాధ‌వ‌రెడ్డి అటువైపు చూడలేదు.

రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు దొంతి మాధ‌వ‌రెడ్డి కూడా ఆయన పాద‌యాత్రను న‌ర్సంపేట‌కు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న దొంతి..ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్‌ను లైట్ తీసుకుంటున్నారన్న చర్చ ఉంది.

అప్పట్లో కొర‌క‌రాని కొయ్యలా మరో ఇద్దరు నేత‌లు

ఇప్పుడు ఈ ఇద్దరి తీరుతో గ‌తంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సంద‌ర్భంలో మరో ఇద్దరు నేత‌లు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, జ‌గ్గారెడ్డిలు కొర‌క‌రాని కొయ్యలాగా వ్యవ‌హ‌రించే వారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌కం అయిన కొత్తలో..డబ్బులు ఇచ్చి పోస్ట్ తెచ్చుకున్నారని వెకంట్‌రెడ్డి డైరెక్ట్‌ అటాక్ చేశారు.

ఆ త‌ర్వాత మునుగోడు ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ త‌ర్వాత కూడా రేవంత్‌పై డైలాగులు పేల్చారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి అయిన త‌ర్వాత వెంక‌ట్ రెడ్డి పూర్తిగా మారిపోయారు. రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లే కాదు.. వ‌చ్చే ఐదేళ్లు కూడా సీఎంగా ఉండాల‌ని గ‌ణ‌ప‌తి హోమం చేయిస్తున్నానంటూ బ‌హిరంగంగా కామెంట్స్ చేశారు. ఇక జ‌గ్గారెడ్డి అయితే అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఒంటికాలిపై లేచేవారు.

ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై ఎవ‌రు విమ‌ర్శలు చేసినా.. జ‌గ్గారెడ్డి ముందుండి తిప్పికొడుతున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇప్పుడు జ‌గ్గారెడ్డి, వెంక‌ట్‌రెడ్డి ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డి ఈగ‌ వాల‌నీయ‌డం లేదు. ఇలా రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కొర‌క‌రాని కొయ్యలా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జ‌గ్గారెడ్డిలు ఇప్పుడాయనకు అనుకూలంగా మారారు.

ఇప్పుడు వారి రోల్‌లో కొత్తగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, దొంతి మాధ‌వ‌రెడ్డి రేవంత్‌కు కంట్లో న‌లుసులా మారార‌ట‌. ఆ ఇద్దరి నేత‌ల మాదిరిగా ఈ ఇద్దరిలో కూడా ఏమైనా మార్పు వ‌స్తుందా లేదా అనేది చూడాలి మరి.