చంద్రబాబు పాలనలో నారావారి సారా స్రవంతి : జగన్

చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో వీధి వీధికి రెండు, మూడు మద్యం షాపులు తయారయ్యాయని జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి బదులుగా ప్రతి గ్రామంలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ మాఫియాను తయారు చేశారని చెప్పారు. పెన్షన్, రేషన్, మరుగుదొడ్లు కావాలన్నా లంచం అడుగుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి డబ్బులను నిలిపివేశారని, ఆర్టీసీ ఛార్జీలు బాదుతున్నారని చెప్పారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడారు.
రాజధానికి అమరావతి అని పేరు పెట్టి అక్కడి అమరేశ్వరుడి భూములు కూడా కొల్లగొడుతున్నారని విమర్శించారు. పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ రాజధాని ప్రాంతంలో చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమని విమర్శించారు. రైతన్నల కోసం ధరల స్థిరీకరణ నిధి పెడుతానన్న చంద్రబాబు.. లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి పెట్టుకున్నాడని విమర్శించారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొని రాజ్యాంగానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఓటు అడిగేందుకు చంద్రబాబుకు ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను రప్పిస్తున్నాడని అన్నారు. ఐదేళ్లలో ప్రతి కులాన్ని మోసం చేశారని తెలిపారు.
చంద్రబాబు బ్యాచ్ విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపారని తెలిపారు. చంద్రబాబు వారికి ఏ శిక్ష వేశారని ప్రశ్నించారు. రైతన్నలకు పంట దిగుబడి, పంటలు వేసే వస్తీర్ణం తగ్గిందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ తగ్గాయని, ఆరు వేల ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయన్నారు.