Jagananna Pachathoranam: జగనన్న పచ్చ తోరణం.. ఎయిమ్స్‌లో మొక్క నాటనున్న సీఎం
జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం.

Jagan
Jagananna Pachathoranam: జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ(05 ఆగస్ట్ 2021) ఉదయం పదకొండున్నర గంటలకు ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారభిస్తారు. అన్నీ జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు.
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.