Kodali Nani: ఏపీ రాజధానిపై కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్

దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఏ రాజధానిలోనైనా..

Kodali Nani: ఏపీ రాజధానిపై కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్

Kodali Nani

Updated On : February 23, 2024 / 8:42 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. అవే ఇప్పుడు మెగా సిటీలుగా మనకు కనపడుతున్నాయని చెప్పారు.

పొలాల్లో రాజధాని ఎలా కడతామని కొడాలి నాని నిలదీశారు. చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దూరంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని తెలిపారు.

మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయని కొడాలి నాని చెప్పారు. రాజధాని నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాలు తీసుకొన్న చంద్రబాబు పిట్టలదొరలా కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజా సమస్యలను నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను జగన్ సృష్టించారని అన్నారు. రాజధాని కడతానని గ్రాఫిక్స్‌తో చంద్రబాబు నాటకాలు ఆడారని చెప్పారు.

వారిద్దరిలో ఎవరు గొప్పో ఆలోచించుకోవాలని కొడాలి నాని అన్నారు. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదని చెప్పారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులు వేశారని తెలిపారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా చంద్రబాబు, పవన్, బీజేపీకి అనవసరమని చెప్పారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి ఏపీలో ఏ రాజకీయనాయకుడికీ లేదని చెప్పారు.

Read Also: అందుకే కల్వకుంట్ల కవితకు సంబంధించి కొత్త సీరియల్ స్టార్ట్ అయింది: జగ్గారెడ్డి