YSRCP : వైసీపీలో భారీ మార్పులు.. రాయలసీమ, కోనసీమ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.

Huge Changes In YSRCP (Photo : Google)
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి రాయలసీమ, కోనసీమ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. మంత్రి పినిపే విశ్వరూప్(అమలాపురం), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం), రాపాక వరప్రసాద్ తో జగన్ వన్ టు వన్ మీటింగ్స్ నిర్వహించారు. అమలాపురం నుంచి విశ్వరూప్ ను మరో చోటుకి మారుస్తారని తెలుస్తోంది. ఇక చిట్టిబాబు, వరప్రసాద్ కు ఈసారి టికెట్ నిరాకరించినట్లు సమాచారం.
మరోవైపు అనంతపురం జిల్లా నుంచి ఉషా శ్రీ చరణ్, శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి కూడా క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం, కడపకు చెందిన రఘురామ రెడ్డి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాలలోని సీట్ల మార్పుపైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
నియోజకవర్గ ఇంఛార్జులను సీఎం జగన్ మారుస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలపై అధిష్టానం ఎక్కువగా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల సిట్టింగుల్లో ఎవరికి టికెట్లు దక్కవనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పనితీరు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కాగా, టికెట్ రాని వారిని బుజ్జగిస్తున్నారు. భవిష్యత్తులో మంచి పదవులు అప్పగిస్తామంటూ నచ్చ చెబుతున్నారు.