మూడుకి బ్రేక్ : మండలిలో అనుకున్నది సాధించిన చంద్రబాబు
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు

వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది వైసీపీ. అయితే, సంఖ్యా బలం ఉండడంతో.. ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ.. తన పంతం నెగ్గించుకుంది.
మండలి సాక్షిగా వికేంద్రీకరణ బిల్లుపై వైసీపీ, టీడీపీ మధ్య పోరు తారస్థాయికి చేరింది. వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకున్న ప్రభుత్వం.. మండలిలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. మండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షం వ్యూహం పన్నింది. బిల్లులను ఎలాగైనా ఆమోదించుకోవాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించినప్పటికీ.. టీడీపీ మాత్రం పట్టుబట్టి మరీ సెలక్ట్ కమిటీకి వెళ్లేలా వ్యవహరించింది. దీంతో చైర్మన్ తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
అటు విజయసాయి రెడ్డి, రోజా.. ఇటు చంద్రబాబు:
మండలిలో ఉద్రిక్త, ఉత్కంఠ పరిస్థితులు ఉండడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. మండలిలోని గ్యాలరీలో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కూర్చుని సమావేశాలను ప్రత్యక్షంగా చూశారు. పక్క గ్యాలరీలో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా కూర్చున్నారు. దీంతో మండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును బయటకు పంపేందుకు అధికార పార్టీ మార్షల్స్‌ను ప్రయోగించింది. అయితే, వైసీపీ వారిని ఎందుకు ఉంచారని చంద్రబాబు ప్రశ్నించారు. అయినా, మండలి చైర్మన్ చెప్తేనే వెళ్తామని చెప్పడంతో చేసేది లేక మార్షల్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సభ్యుల మీదకు దూసుకొచ్చిన కొడాలి నాని:
అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలిలో యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన తేల్చి చెప్పారు. మరోవైపు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఓటింగ్‌కు టీడీపీ పట్టుపట్టింది. దీంతో ప్రభుత్వ, ప్రతిపక్ష వర్గాల మధ్య వాదోపవాదనలతో సభ దద్దరిల్లింది. ఒకానొక సమయంలో మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదానికి దిగారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని కూడా పోడియం ముందే నిలబడి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు కొడాలి నాని యత్నించగా నాని మీదకు దూసుకెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. దీంతో కౌన్సిల్ 15 నిముషాల పాటు వాయిదా పడింది.
చైర్మన్ విచక్షణాధికారం:
శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ప్రతిష్టంభన కొనసాగింది. టీడీపీ లేఖ సకాలంలో అందిందని, అయితే సాంకేతికంగా మూవ్ కాలేదని మండలి చైర్మన్ తెలిపారు. చైర్మన్ ప్రకటన వెలువడగానే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. సకాలంలో అందిందని చెబుతూనే.. సాంకేతికంగా ఎలా మూవ్ కాలేదని చెబుతారని అన్నారు. సిబ్బంది చేసిన తప్పుకి మమ్మల్ని ఎలా శిక్షిస్తారని యనమల ప్రశ్నించారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న అధికార పక్షం.. సెలెక్ట్ కమిటీకి పంపడం సాంకేతికంగా సాధ్యంకాదని వాదించింది. చైర్మన్ తన నిర్ణయం ప్రకటించే సమయానికి పోడియం వద్ద భారీగా రెండు పక్షాలు మోహరించాయి. సభ్యులతో పాటు పోడియం వద్దకు 20 మంది మంత్రులు వచ్చారు. దీంతో పోడియం వద్ద మంత్రులతో టీడీపీ ఎమ్మెల్సీల వాగ్వాదం జరిగింది.
బిల్లును ఆమోదించాలంటూ ప్రభుత్వం పట్టుబట్టినప్పటికీ.. మండలి చైర్మన్ మాత్రం తన విచక్షణ అధికారం ఉపయోగించి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించారు. రూల్ 154 ప్రకారం.. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. దీంతో మండలిలో సంఖ్యాబలం ఎక్కువున్న విపక్షం పైచేయి సాధించింది.
* వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో ఉదయం నుంచి హైడ్రామా
* బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం
* బిల్లు కమిటీకి వెళ్లకుండా శతవిధాలా ప్రయత్నించిన వైసీపీ
* సంఖ్యాబలం ఉండడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ
* మండలిలో ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో రంగంలోకి దిగిన చంద్రబాబు
* గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల
* పక్క గ్యాలరీలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రోజా
* చంద్రబాబును బయటకు పంపేందుకు మార్షల్స్ ప్రయోగం
* వైసీపీ వారిని ఎందుకు ఉంచారని ప్రశ్నించిన చంద్రబాబు
* మండలి చైర్మన్ చెప్తేనే వెళ్తామని చెప్పడంతో వెనక్కి వెళ్లిన మార్షల్స్
* చివరికి విచక్షణాధికారం ఉపయోగించిన మండలి ఛైర్మన్
Also Read : ఏపీ శాశ్వత రాజధాని అమరావతే : విలీనం..విలీనం అనొద్దని పవన్ సీరియస్