దయ్యాన్ని వదిలిస్తానని రూ.6 లక్షలు తీసుకున్న బాబా ఏమయ్యాడు ?

  • Published By: chvmurthy ,Published On : March 11, 2020 / 04:09 AM IST
దయ్యాన్ని వదిలిస్తానని రూ.6 లక్షలు తీసుకున్న బాబా ఏమయ్యాడు ?

Updated On : March 11, 2020 / 4:09 AM IST

స్వామీజీ అవతారమెత్తి ప్రజలను  మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత  వైద్యం  చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు చేయటం అతని నైజం. ఈ క్రమంలోనే ఒక మహిళను మోసిగించి కటకటాల పాలయ్యాడు దొంగ బాబా. మరణించిన వ్యక్తి ఇంట్లోనే దెయ్యమై తిరుగుతున్నాడని  ఆ దెయ్యాన్ని  ఇంట్లోంచి వెళ్లగొడతానని చెప్పి ఆరు లక్షలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తవారి పల్లె పంచాయతీ, రాయుని చెరువు  వడ్డిపల్లె(ఆర్‌సీ వడ్డిపల్లె) కు చెందిన డేరంగుల రామకృష్ణ అలియాస్ రామకృష్ణ స్వామిజీ (47)  చిన్నప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. కాల క్రమంలో గుప్తనిధులు వెలికి తీసే ముఠాలో చేరి  జిల్లా వ్యాప్తంగా గుప్తనిధులు వెలికితీయటంలో పేరు సంపాదించాడు. గుప్తనిధులు తీస్తున్నామని చెప్పి అక్కడ గోతిలో నకిలీ విగ్రహాలు పెట్టి ప్రజలను నమ్మించి లక్షలు దండుకునేవాడు. ఈవ్యాపారం బాగా సాగుతుండటంతో భూతవైద్యం కూడా చేయటం మొదలెట్టాడు. 

ఇలా ఉండగా…. మదనపల్లె బుగ్గకాలువకు చెందిన షేక్‌ హసీనా ఈ దొంగ స్వామిని దర్శించుకుంది. ఆమె భర్త మస్తాన్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆమె ఇంటిలో మస్తాన్‌ ఆత్మ తిరుగుతోందని, గుప్త నిధులు ఉండడం వల్లే అలా జరుగుతోందని  మాయమాటలు చెప్పి హసీనాను నమ్మించాడు. తాను ఎంతో మందికి భూతవైద్యం చేసి దెయ్యాలను తరిమిగొట్టానని…. అలా ఇక్కడ కూడా చేస్తానని ఆమెను నమ్మించాడు. దయ్యాన్ని వెళ్లగొట్టటానికి రూ.6 లక్షలు ఖర్చవుంతుదని చెప్పి ఆమె వద్ద డబ్బులు తీసుకున్నాడు.

తరువాత స్వామిజీ కనిపించకుండా మాయమయ్యాడు. అనుమానించిన బాధితురాలు మోసపోయానని గ్రహించి నాలుగు రోజుల  క్రితం వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. నిందితునిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కల్యాణ మండలం సర్కిల్‌ వద్ద కారులో వెళుతుండగా పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

See Also | ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దారుణ హత్య…అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే చంపేశాడు