మదనపల్లి కూతుళ్ల హత్య కేసు.. మానసిక వైద్యశాల నుంచి దంపతులు డిశ్చార్జ్

సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం(మార్చి 29,2021) విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారిని మదనపల్లి సబ్ జైలుకి తరలించారు పోలీసులు. జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్య లను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

మదనపల్లి కూతుళ్ల హత్య కేసు.. మానసిక వైద్యశాల నుంచి దంపతులు డిశ్చార్జ్

Madanapally Case

Updated On : March 29, 2021 / 2:48 PM IST

Madanpalle Double Murder Case : సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం(మార్చి 29,2021) విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారిని మదనపల్లి సబ్ జైలుకి తరలించారు పోలీసులు. జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్య లను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి మానసిక స్థితి సరిగా లేదని ఫిబ్రవరి 4న చికిత్స కోసం విశాఖ మానసిక హాస్పిటల్‌కు తరలించారు. విశాఖ మానసిక హాస్పిటల్ డాక్టర్లు ఇరువురికీ మెరుగైన వైద్యం అందించారు. దీంతో దంపతులు కోలుకున్నారు. కూతుళ్ల హత్యలపై వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది…
మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గతేడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు.

ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపారని, ఆ తరువాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారనే ఆరోపణలతో కేసు నమోదైంది. పునర్జన్మ అనే మూఢనమ్మకంతో కూతుళ్లను తల్లిదండ్రులే హత్య చెయ్యడం సంచలనంగా మారింది.

ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. రాత్రి 11గం.ల సమయంలో పురుషోత్తం నాయుడు, పద్మజ ఇంటికి వెళ్లగా అప్పటికే పూజా గదిలో ఒకరు… డ్యూఫ్లెక్స్ భవనంలో పైన బెడ్ రూమ్ లో మరొకరు చనిపోయి ఉండడం గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ తర్వాత ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.