Mentha Cyclone : తీవ్ర తుపానుగా మొంథా.. మునిగిపోయిన బీచ్ రోడ్.. వాహనాల రాకపోకలు నిలిపివేత.. వీడియో వైరల్..
Mentha Cyclone తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షం నీటిలో బీచ్ రోడ్డు మునిగిపోయింది.
Cyclone Montha
Mentha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు.. కాకినాడకు 280కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 340 కిలో మీటర్లు దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్లు వేగంతో ఉత్తర వాయువద్య దిశగా తుపాను కదిలినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
తీవ్ర తుపానుగా మారిన మొంథా సైక్లోన్ ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో 110 కిలో మీటర్ల వేగంతో.. మిగిలిన ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.
‘మొంథా’ తీవ్ర తుపానుగా మారడంతో 18గంటలు ఏపీలో తుపాను బీభత్సం కొనసాగనుంది. ఇవాళ, రేపు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తుపాను ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపింది. ఏపీలోన 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు తుపాను ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షం నీటిలో బీచ్ రోడ్డు మునిగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
