అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నాం : మంత్రి నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గం వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

Nara Lokesh
Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గం వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెంలో నూతన మహావీర్ గోశాల భవనాన్ని కేంద్రమంత్రి పేమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. మంగళగిరికి రాజధానికి మధ్య ఎంతో కీలకమైన నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరో నెలలో ప్రారంభిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
ఏయూ వీసీలపై విచారణ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. లోకేశ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎక్కడా కక్షసాధింపు చర్యలకు వెళ్లడం లేదని అన్నారు. చట్టాలు ఉల్లంఘించారని ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
మంగళగిరి నియోజకవర్గం, యర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. https://t.co/IYbKIT0Ofr
— Telugu Desam Party (@JaiTDP) March 14, 2025