ప్రాణం తీసిన కుటుంబ కలహాలు : ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తల్లి ఆత్మహత్య

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 06:59 PM IST
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు : ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తల్లి ఆత్మహత్య

Updated On : August 24, 2020 / 6:29 AM IST

కృష్ణా జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో సహా మహిళ కూడా మృతి చెందింది.



కొండపల్లి మార్కెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తల్లి లావణ్య.. తన 3 సంవత్సరాల బాలుడు, ఏడాదిన్నర సంవత్సరం పాపకు విష మిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. దీనికి ప్రధానంగా భార్యభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు కారణమని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న భార్యాభర్తలు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ‘నీ చేతనైంది చేసుకో’ అంటూ భర్త తీవ్ర స్థాయిలో భార్యను మందలించారు.



భర్త మందలించిన తర్వాత భార్య ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా మార్కెట్ యార్డు సమీపంలోని కొండపల్లి ఖిలా దగ్గరికి వెళ్లి పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భర్త ఘటనాస్థలికి చేరుకున్నారు. ‘చిన్న గొడవ వల్ల ఇద్దరం తిట్టుకున్నాం… కానీ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని అనుకోలేదు’ అని కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న లావణ్య కుటుంబ సభ్యులు మాత్రం భర్తపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే చివరికి తన కూతురును ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారని తల్లి వాపోయింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉరి శిక్ష పడే విధంగా చూడాలని పోలీసులను ముందు కన్నీరుమున్నీరుగా విలపించింది.