కడప నెక్ట్స్ మేయర్ ఎవరు? రేసులో ముందుందెవరు?

దీంతో ముంతాజ్ ఎన్నిక అనివార్యంగా కన్పిస్తోందన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

కడప నెక్ట్స్ మేయర్ ఎవరు? రేసులో ముందుందెవరు?

Updated On : May 15, 2025 / 9:24 PM IST

సైకిల్ పార్టీ దెబ్బకు కడప మేయర్ పీఠం కదిలింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి విసిరిన ఛాలెంజ్ లో తానే నెగ్గారు. ఫైనల్ గా విజిలెన్స్ విచారణలో కడప మేయర్ అవినీతి బయట పడడంతో మేయర్ సురేష్ బాబుపై పురపాలక శాఖ వేటు వేసింది. నెక్స్ట్ మేయర్ ఎవరనేది కడపలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.

మహానాడులోపు మేయర్ పీఠంపై కొత్త మేయర్ను కుర్చీలో కూర్చోబెట్టేంఉదకు కొత్త వ్యూహానికి పదును పెడుతోంది సైకిల్ పార్టీ. వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా కడప గడపలోనే కూటమి తన పవరేంటో నిరూపించిందన్న టాక్ విన్పిస్తోంది. అంతేకాదు…ఈనెల చివర్లో కడపలో మహానాడు జరగబోతోంది..మహానాడు కంటే ముందే కడప మేయర్ పీఠాన్ని కదిలించి కూటమి సత్తా చాటింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్ గా కార్పొరేషన్ లో సీట్ నిరాకరించడంతో ఏకంగా మేయర్ సీటే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే, మేయర్ సురేష్ బాబుకు ఛాలెంజ్ విసిరారు.

ఛాలెంజ్ కి తగ్గట్టుగా కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి బయటపెట్టి విజిలెన్స్ విచారణ చేపట్టడంతో 36 లక్షల రూపాయలు అవినీతి బండారం బయట పడింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేయర్ కానీ కుటుంబ సభ్యులు కానీ కార్పొరేషన్ లో ఎలాంటి పనులు చేయకూడదనే నిబంధన ఉల్లంఘించారు మేయర్ సురేష్ బాబు. విజిలెన్స్ విచారణలో అవినీతి బయటపడటంతో మేయర్ పీఠానికే ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్లిన మేయర్ సురేష్ బాబుకు అక్కడ కూడా చుక్కెదురే అయింది.

Also Read: రాజన్న ఆలయం చుట్టూ వివాదం.. ఎందుకిలా?

మేయర్ సురేష్ బాబు వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. దీంతో మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు మరో 14 రోజుల్లో రానున్నాయి. సురేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పువస్తే..మేయర్ స్థానంలో కొత్త మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే టిడిపి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది.

అన్ని పరిణామాలు ఇలా వేగంగా..
కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉంటే అందులో 49 డివిజన్లలో వైసిపి, ఒక్క డివిజన్ మాత్రమే టిడిపి గెలిచాయి. మేయర్ గా సురేష్ బాబు, మొదటి డిప్యూటీ మేయర్ గా ముంతాజ్ బేగం, రెండో డిప్యూటీ మేయర్ గా నిత్యానంద రెడ్డి కొనసాగుతున్నారు. కడప కార్పొరేషన్ మేయర్ గా 2021 మార్చి 18 న సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. 2023 మే15లో మేయర్ కుమారుడు అమరేశ్ సతీమణి జయశ్రీ పేరుతో వర్దిని కన్స్ట్రక్షన్ సంస్థను క్లాస్-5 కాంట్రాక్టర్ గా కడప కార్పొరేషన్ లో రిజిస్టర్ చేశారు.

ఈ సంస్థకు రోడ్లు, కాలువలు కలిపి మొత్తం 10 పనులు గుత్తేదారు అప్పగిస్తే అందులో ఏడు పనులు పూర్తికాగా..మరో 3 పనులు ఒప్పందం పూర్తి కాలేదు. మేయర్ పదవీ కాలం 2026 మార్చి 17 వరకూ ఉంది. అయితే విజిలెన్స్ విచారణలో అవినీతి బయట పడడంతో మేయర్ సీటుకు ఎసరు పెట్టింది పురపాలక శాఖ. వెంటనే మేయర్ స్థానం నుంచి ఆయన్ని తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముందు నుంచి మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఏడుగురు కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు. మరికొంత మంది అఫీషియల్ గా కాకుండా అనధికారికంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డితో జిల్లా అధ్యక్షుడు వాసుతో టచ్ లో ఉన్నారట. కొత్త మేయర్ అనే చర్చలో మొదటి డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న ముంతాజ్ బేగం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముంతాజ్ భర్త కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడు వాసుతో టచ్ లోకి వెళ్లినట్టు చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే సైకిల్ పార్టీ నేతలు సైతం మొదటి డిప్యూటీ మేయర్ ముంతాజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ముంతాజ్ ఎన్నిక అనివార్యంగా కన్పిస్తోందన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ అవినీతి వలలో చిక్కుకొని సురేష్ బాబు మేయర్ పీఠాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన పంతాన్ని మొత్తానికి నెరవేర్చుకున్నారన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. తనకే కుర్చీ లేకుండా చేస్తారా…మీ కుర్చీనే లేపేస్తానంటూ ఆమె చేసిన ఛాలెంజ్ ను ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారట.