Rajanna Temple: రాజన్న ఆలయం చుట్టూ వివాదం.. ఎందుకిలా?
ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండడంతో జూన్ నెలలో భీమేశ్వరాలయంలో అభిషేకాలు, అన్నపూజాలు, కోడె మొక్కులు జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల రాజన్న ఆలయం చుట్టూ రాజకీయ వివాదం మొదలైంది. ఆలయ విస్తరణపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్త వేములవాడ బంద్ కు దారి తీసింది. ఆలయాన్ని అభివృద్ది చేస్తామంటే అభ్యంతరం ఎందుకంటు అధికార పార్టీ విపక్షాలను ప్రశ్నిస్తుంటే..అసలు సర్కార్ నిర్ణయమే తప్పంటున్నారు అఖిల పక్ష నేతలు. ఇంతకీ వేములవాడ రాజన్న ఆలయంపై నెలకొన్న వివాదం ఏంటి? అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతిపక్షాలు చేస్తున్నా డిమాండ్ ఏంటి?
భక్తి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వచ్చే నెల జూన్ 15 నుంచి విస్తరణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు 47 కోట్ల రూపాయల నిధులను కూడా మంజురు చేశారు. వేములవాడ ఆలయ విస్తరణ కోసం 2025-2026 బడ్జెట్ లో దాదాపు 100 కోట్లను కేటాయించారు.
శృంగేరి పీఠాధిపతుల పర్యవేక్షణలో ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ విస్తరణ పనులు చేపడితే..భక్తుల దర్శనాలకు ఇబ్బంది కలగకుండా వేములవాడ ఆలయానికి దగ్గర్లో ఉన్న భీమేశ్వరాలయంలో దర్శనాలను కొనసాగించాలని నిర్ణయించడంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడిని మూసేసి విస్తరణ చేపడుతామంటే కుదరదని అఖిల పక్ష నేతలు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో రాజన్న ఆలయం చుట్టూ రాజకీయ వివాదం మొదలైంది.
Also Read: పదవుల కోసం కొందరు.. పైసా పని కావడంలేదని మరికొందరు.. అధికార పార్టీలో ఏం జరుగుతోంది?
వేములవాడ రాజన్నను నిత్యం వేలాది మంది భక్తులు దర్శిచుకుంటారు. ఇక ప్రత్యేక రోజుల్లో అయితే లక్షలాది మంది భక్తులు బారులు తీరుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయాన్ని మరింతగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. దేవాలయ ప్రధాన గర్భాలయం, మండప భాగాన్ని మెరుగు పరిచి, పురాతన నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ..కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తారు.
ఆలయంతో పాటు ధర్మగుండం, గుడి చెరువు ఇలా మొత్తం 35 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించడంతో పాటు స్వామి వారి కోనేరు, కళ్యాణకట్ట, కోడె మొక్కులు చెల్లించే దారి, అన్నదాన సత్రం, వసతి గృహలు ఇలా అన్నీ ఒకే కాంప్లెక్స్ లో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారు. అయితే అన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
పనులు ఏడాది పాటు కొనసాగే అవకాశం
ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండడంతో జూన్ నెలలో భీమేశ్వరాలయంలో అభిషేకాలు, అన్నపూజాలు, కోడె మొక్కులు జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పునర్నిర్మాణం పేరిట ఆలయాన్ని మూసి వేయోద్దంటు డిమాండ్ చేస్తున్నారు రాజన్న ఆలయ రక్షణ సమితి నాయకులు. రాజన్న ప్రధాన ఆలయంలోనే భక్తులకు అనుమతించి విస్తరణ పనులు చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రార్ధనా మందిరాలు లేకుండా చూడాలంటున్నారు బిజెపి నేతలు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడంతో ఆలయ విస్తరణ పనులపై విమర్శలు పెరుగుతున్నాయి. అసలు ఆలయాభివృద్దికి ఎన్ని కోట్లు నిధులు మంజురయ్యాయో, ఏ రకమైన డిజైన్లు ఖరారు చేశారో వెల్లడించకుండా జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసి వేస్తామనడంపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఆలయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటున్న బీఆర్ఎస్…భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
ప్రభుత్వం చిత్తశుద్దితో ఆలయ అభివృద్ది పనులు చేపడుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణ పనులు జరిగే సమయంలో స్వామి వారికి నిత్యం జరిగే పూజాకైంకర్యాలన్నీ యధావిధిగానే కొననసాగుతాయాని, ఆలయ మూసివేత ఉండదని స్పష్టం చేస్తున్నారు. రాజన్న ఆలయంలో చేసే పూజలను భీమేశ్వరాలయంలో ఎలా చేస్తారంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కాశీ, అయోధ్యలో దర్శనాలకు ఇబ్బంది లేకుండా చూసినట్లుగానే వేములవాడ విస్తరణ పనులు జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య గుడి అభివృద్దిపై తలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడంతో..రాజన్న ఆలయం చుట్టూ రాజకీయం కొనసాగినట్లవుతోంది.
రాష్ట్రంలో అతిపెద్ద దేవస్థానంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయంలో 1979లో జరిగిన పనులే తప్ప మళ్లీ ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. రాజన్న ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడం, ఆలయం ఇరుకుగా ఉండడంతో కొన్నేళ్లుగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జూన్ 18న సీఎం హోదాలో వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేసీఆర్..ప్రతీ బడ్జెట్‌లో 100 కోట్ల చొప్పున మొత్తం 400 కోట్లతో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.
ఆ తర్వాత వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ-వీటీడీఏని ఏర్పాటు చేశారు. కానీ ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని విస్తరించాలని నిర్ణయించింది. అయితే విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఆలయ విస్తరణ పనులు ఎలా కొనసాగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. మరి భగవంతునికి..భక్తునికి ఇబ్బంది లేకుండా దర్శనాలు ఎలా జరుగుతాయో అనేది చూడాలి.