విజయవాడలో ఏం జరుగుతోంది ? మటన్ అంటే మండిపడుతున్నారు..చికెన్ అంటే..ఛీ ఛీ అంటున్నారు..

Mutton Mafia : సండే అని నాన్ వెజ్ మార్కెట్లకు క్యూ కడుతున్నారా..? ఫ్రెష్ అని చెప్పేస్తే కొనుకొచ్చుకొని లొట్టలేసుకుని తింటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి.. అసలు ఆ మాంసం తాజాదేనా..? మీరు కొనాలనుకున్న చికెన్, మటన్ ఏ అమ్ముతున్నారా..? లేక వేరే మాంసాన్ని ఏమైనా అంటగడుతున్నారా..? విజయవాడలో వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తేంటే.. ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. మరి విజయవాడలో ఏం జరుగుతోంది..?
విజయవాడలో మటన్ మాఫియా గుట్టు మరోసారి రట్టు అయింది. మటన్ అంటేనే మండిపడేలా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యాపారులు. చికెన్‌ను కూడా ఛీ ఛీ అని చీదరించుకునే చేస్తున్నారు. వ్యాపారం మాటున.. నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం జంకడం లేదు.
కొన్ని సందర్భాల్లో నిల్వ పెట్టిన దాన్ని అమ్ముతుండగా.. మరికొన్ని సార్లు కుళ్లిన మాంసాన్ని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉంచిన మాంసాన్ని ఫ్రెష్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ అంటగడుతున్నారు. నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తున్నారంటూ.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో.. మున్సిపల్ అధికారులు మరోమారు తనిఖీలు చేపట్టారు. తాజా తనిఖీల్లో కూడా కలవరపడే వాస్తవాలను గుర్తించారు అధికారులు. విజయవాడ నగరంలోని చాలా మటన్, చికెన్ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో బీఫ్ మాంసాన్ని కూడా గుర్తించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయా నాన్‌వెజ్ వ్యాపారస్తులకు నోటీసులను జారీ చేశారు. రోజుల తరబడి నిల్వ పెట్టుకుని మరీ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. పైకి మాత్రం వినియోగదారులకు తాజా మాంసాన్ని ఇస్తున్నట్టుగా నమ్మించే యత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల మాంసాన్ని తినేవారి సంఖ్య కూడా పెరిగింది.
సొమ్ము చేసుకునే క్రమంలో.. ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు వ్యాపారులు. ఇష్టానుసారంగా నిల్వ ఉంచిన.. కుళ్లిన మాంసాన్ని అంటగట్టేస్తున్నారు. గోళ్లపాలెం సెంటర్‌లో ఇటీవల ఇదే తరహా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కచోట అని కాదు.. విజయవాడ నగర వ్యాప్తంగా అనేక కాలనీల్లో ఇదే తరహా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సో… ఈసారి నాజ్ వెజ్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు తస్మాస్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి ఇలాంటి ఘటనలు. అధికారులు కూడా తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పకనే చెబుతున్నాయి.