ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా వైద్య విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
వారు గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినత పత్రాన్ని సమర్పించారు. వైద్య విద్యార్థుల సమస్యలపై లోకేశ్ సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను తీర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా లోకేశ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. “2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో నేత మా నాయకులు మేము ప్రజల తరఫున పోరాడాలని మేము వెళ్లినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.
ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటకు రాకుండా గేట్లను తాడులతో బంధించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో మేము వారు చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే, మాపై దాడి చేసి కేసులు పెట్టి, దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయం పై దాడి చేశారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. మేము ఆ రోజుల్లోనే 19 బహిరంగ సభల్లో ప్రజలందరికీ రెడ్ బుక్కు చూపించి, వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్న అధికారులు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పాము.
మొన్న కావాలని గన్నవరంలో ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసులు విత్ డ్రా చేయించిన గన్నవరం మాజీ శాసనసభ్యుడు, ఆ కేసులు వలనే ఇప్పుడు జైలుకి వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి.. మాకు ఎటువంటి సందేహాలు లేవు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.