వర్షిత హత్య కేసు : తీర్పు వాయిదా..కొత్త ట్విస్టు

  • Published By: madhu ,Published On : February 17, 2020 / 09:03 AM IST
వర్షిత హత్య కేసు : తీర్పు వాయిదా..కొత్త ట్విస్టు

Updated On : February 17, 2020 / 9:03 AM IST

ఏపీలో సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో తుది తీర్పు 2020, ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారానికి వాయిదా పడింది.  అయితే..ఈ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోర్టులో నిందితుడు తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన వాదనలను వినిపించుకొనేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్‌లో నిందితుడు రఫీ వెల్లడించారు. ఈ పిటిషన్‌పై చిత్తూరు సెషన్ కోర్టు 2020, ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. 

గతేడాది నవంబర్ 7న కురబలకోట మండలం చేనేత నగర్‌లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వచ్చిన చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. చిన్నారి వర్షితను హతమార్చింది మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీగా తేల్చారు పోలీసులు. నిందితుడు రఫీని నవంబర్ 16న అరెస్టు చేసిన పోలీసులు.. అతనిపై హత్య, పొక్సో చట్టం కింద రఫీపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో 41 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. విచారణ పూర్తయిన నేపథ్యంలో చిత్తూరు సెషన్స్ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఏం జరిగింది
బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెంకు చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతులకు వైష్ణవి, వర్షిణి, వర్షిత అనే ముగ్గురు కుమార్తెలున్నారు. గతేడాది నవంబర్‌ 7న అంగల్లు సమీపంలోని చేనేత నగర్‌లో ఉన్న కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపంలో బంధువుల పెళ్లి ఉండటంతో సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. అంతకుముందు రాత్రి 10 గంటల వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారి వర్షిత ఒక్కసారిగా మాయమైపోయింది. 10 గంటల తరువాత తల్లిదండ్రులు చిన్నారి కోసం కళ్యాణమండపమంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. వెంటనే చిన్నారి కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజీల్లో రఫీ చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. 

సీన్‌కట్‌ చేస్తే….తెల్లవారుజామున పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వెంటనే అక్కడి చేరుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు….కుమార్తె విగతజీవిగా దర్శనం ఇవ్వడంతో కుప్పకూలిపోయారు. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న కూతురు…శవంగా మారడం చేసి కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని పరిశీలించారు. బాలిక వర్షితని కిడ్నాప్‌ చేసిన రఫీ..అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు అనుమానించారు. అనంతరం చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.