మాజీ మంత్రి అయ్యన్నపై నిర్భయ కేసు

తెలుగుదేశానికి చెందిన నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఈఎస్ ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అయిన..కొద్ది రోజులకే టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే : –
మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అయ్యన్న పాత్రుడి తాత..లత్సా పాత్రుడు ఫొటోను అధికారులు తీసి..ఇటీవలే ఛైర్మన్ ఉన్న గదిలోకి మార్చారు. ఈ విషయం అయ్యన్నకు తెలిసింది. వెంటనే అనుచరగణంతో అక్కడకు చేరుకున్నారు. తన తాత ఫొటోను యథా స్థానంలో ఉంచాలంటూ..డిమాండ్ చేశారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలతో కలిసి ఆందోళన చేశారు. ఇదంతా 2020, జూన్ 15వ తేదీన జరిగింది.
హాల్ కు రంగులు వేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత..ఫొటోను యథాస్థానంలో ఉంచుతామని కమిషనర్ వివరణనిచ్చారు. ఫొటో తొలగించే అధికారం కమిషనర్ కు ఎవరిచ్చారంటూ..ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు తొత్తుగా మారారంటూ..ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు చేసిన నోటి దురుసుతో మనస్థాపానికి గురైన కమిషనర్ ..పట్టణ పీఎస్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిర్భయ కింద కేసు నమోదు చేశారు.