GVMC మేయర్ పీఠాన్ని దక్కించుకునేదెవరు?

రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులతో 59 నుంచి 31కి పడిపోయింది వైసీపీ బలం.

GVMC మేయర్ పీఠాన్ని దక్కించుకునేదెవరు?

Updated On : April 18, 2025 / 9:25 PM IST

GVMC మేయర్ పీఠాన్ని దక్కించుకునేదెవరు? తగ్గేదేలే అంటూ అధికార విపక్షాలు మాత్రం మాదే మేయర్ పీఠమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. శనివారం జరగబోయే అవిశ్వాస తీర్మానంలో గెలిచేదెవరు? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు కూటమి…ఇటు విపక్ష వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయంట. ఇప్పటికే క్యాంప్ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంలో ఎవరికి ఓటు వేయబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంకు రంగం సిద్ధం అయ్యింది. ఈనెల 19న మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అవిశ్వాస తీర్మానంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్‌ కూడా జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్‌ జారీ చేసింది.

అయితే ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు అటు కూటమి సైతం పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ తమ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించి విశాఖకు తీసుకొచ్చింది.

Also Read: ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతుంది? స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది?

ఇటు మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లంతా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే అవిశ్వాస తీర్మాణం ప్రక్రియ జరగకుండా ఉండేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్న చర్చ నడుస్తున్న క్రమంలో ఆ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు. ఈనెల 19లోపు మరింతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరిపోతారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

డబ్బును మంచినీళ్లలా ఖర్చు!
కో ఆప్షన్ సభ్యులను కలిపి GVMCలో మొత్తం 111 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు మ్యాజిక్ ఫిగర్ 74 కాగా, కూటమి ఖాతాలో ఇప్పటికే 76 మంది సభ్యులు ఉండటంతో అవిశ్వాస తీర్మానం దాదాపు ఖాయం అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులతో 59 నుంచి 31కి పడిపోయింది వైసీపీ బలం. అయితే విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు వైసీపీ..ఇటు కూటమి డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాయనే టాక్ విన్పిస్తోంది. విదేశాల్లో క్యాంప్ రాజకీయాల పేరిట కోట్లాది రూపాయలను ఇప్పటికే ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యేక విమానాల్లో కార్పొరేటర్లను విదేశాలకు తరలించాయి అటు కూటమి, ఇటు వైసీపీ. అలా మలేసియా, సింగపూర్ లో వారంతా దాదాపు 15రోజుల పాటు జల్సాలు చేసినట్లు తెలిసింది. ఒక్కో కార్పొరేటర్ పై దాదాపు 50 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. అందులో విదేశాలకు తరలింపు, అక్కడ ఎంజాయ్ మెంట్ కు 30 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు సమాచారం.

ఇక అవిశ్వాసం సందర్భంగా 25 లక్షల వరకు వ్యక్తిగత చెల్లింపులంటూ ప్రచారం జరుగుతోంది. మరో 11 నెలల పదవీ కాలం మాత్రమే ఉండే పాలక వర్గం కోసం ఈ రేంజ్ లో ఖర్చేంటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతఖర్చు చేసినా…విదేశాల నుంచి తిరిగొచ్చిన కార్పొరేటర్లు ఏఏ పార్టీల్లోకి చేరిపోవాలో ఆయాపార్టీల్లోకి వెళ్లి కండువాలు మార్చుకున్నారు. అంటే క్యాంప్ రాజకీయాల పేరుతో ఖర్చుపెట్టిన డబ్బుంతా బూడిదలో పోసినా పన్నీరే అయిందన్న వాదన విన్పిస్తోంది.

మొత్తానికి GVMC మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఒకవైపు కూటమి,..మరోవైపు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక సమావేశంరోజు డుమ్మా కొట్టి అవిశ్వాసాన్ని నెగ్గేందుకు వైసీపీ వ్యూహాలకు పదును పెడుతుండగా..మేయర్ పీఠాన్ని నెగ్గేందుకు కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.